ఎన్నాళ్ల వరకు చూస్తాం.. రేవంత్ సర్కార్ పై మోడీ సంచలన వ్యాఖ్యలు..

తెలంగాణలోని కాంగ్రెస్ సర్కార్ పై ప్రధాని మోడీ హాట్ కామెంట్స్ చేశారు.

Update: 2024-03-05 09:18 GMT

దిశ, సంగారెడ్డి బ్యూరో/ పటాన్‌చెరు : కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య అవినీతి బంధం ఉందని, ఆ రెండు పార్టీలు ఒకే గూటి పక్షులని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు. బీఆర్ఎస్ చేసిన కాళేశ్వరం అవినీతిని బయటపెట్టకుండా, విచారణకు ఆదేశించకుండా కాంగ్రెస్ కాపాడే ప్రయత్నం చేస్తోందని ధ్వజమెత్తారు. ఇవాళ ఉదయం మోడీ సికింద్రాబాద్‌లోని ఉజ్జయినీ మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో సుమారు రూ. 7200 కోట్ల రోడ్లు, రైలు, ఏవియేషన్ అభివృద్ధి పనులు, ఘట్కేసర్-లింగంపల్లి ఎంఎంటీఎస్ సేవలను ఆయన ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప సభలో పీఎం ప్రసంగించారు. తెలుగులో స్పీచ్ మొదలుపెట్టిన మోడీ.. ‘తెలంగాణలో నా పర్యటన రెండోరోజు సాగుతున్నది.. ఇక్కడి ప్రజలు చూపిస్తున్న ప్రేమ, ఆదరణను వృథా కానివ్వను. తెలంగాణను రెండింతలు అభివృద్ధి చేసి చూపిస్తాను’ అని పేర్కొన్నారు.

ఎన్నిరోజులు కాపాడుతుందో చూస్తాం..

కాళేశ్వరం బీఆర్ఎస్‌కు ఏటీఎంలా మారిందని, అయితే కాంగ్రెస్ ఎన్ని రోజులు బీఆర్ఎస్ అవినీతిని కప్పిపుచ్చుతోందో చూస్తామని మోడీ వ్యాఖ్యానించారు. అది ఎక్కువ రోజులు నిలవదని అన్నారు. తాము యువతకు రాజకీయంగా అవకాశం కల్పిస్తుండటంతో కుటుంబ పార్టీలకు భయం పట్టుకుందని అన్నారు. కుటుంబ పార్టీలు నల్ల ధనాన్ని తెల్ల ధనంగా మార్చుకున్నాయని ఆరోపించారు. ఇప్పటివరకు నా కోసం ఒక్క ఇల్లు నిర్మించుకోకపోయినా పేదల కోసం 4 లక్షల ఇండ్లను నిర్మించానని చెప్పారు. తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రం ఎన్నో నిధులు కేటాయించిందన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న దానితో పోల్చుకుంటే.. దళిత, వెనుకబడిన వర్గాల ప్రజల కోసం పదేళ్లలో ఎంతో చేశామని, మాదిగ రిజర్వేషన్ల కోసం ఒక ప్యానెల్‌ను ఏర్పాటు చేశామని మోడీ పేర్కొన్నారు.

Tags:    

Similar News