Harish Rao: మెడికల్ అడ్మిషన్లపై న్యాయపోరాటానకి వెనకాడబోము: హరీశ్ రావు
జీవో 33 బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు మాజీ మంత్రి హరీశ్ రావును కలిశారు.
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రభుత్వ నిర్ణయం వల్ల స్వరాష్ట్రంలో తెలంగాణ బిడ్డలు ఎంబీబీఎస్, బిడీఎస్ చదివే అవకాశం కోల్పోతున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల విషయంలో ప్రభుత్వం విడుదల చేసిన జీవో 33 కు సంబంధించి హైదరాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాలకు చెందిన బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు గురువారం హరీశ్ రావును కలిశారు. నాలుగేళ్ల నిబంధన వల్ల తెలంగాణలో పుట్టిన పిల్లలు తెలంగాణలో నాన్ లోకల్ కావడం బాధకరం అని, ఈ జీవో వల్ల తమ పిల్లలు వైద్య విద్యకు దూరం అయ్యే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని హరీశ్ రావును కోరారు. పేరెంట్స్ విజ్ఞప్తి పై స్పందించిన హరీశ్ రావు.. తెలంగాణ విద్యార్థులకు తీవ్ర నష్టం కలిగించే జీవో 33పై పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా న్యాయ పోరాటానికి సైతం వెనకాడబోమని స్పష్టం చేశారు. తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళన చెందవద్దని, ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మన పిల్లలకు అడ్మిషన్ల కోసం స్థానికతను నిర్ధారించుకోవడానికి కొత్త సమగ్ర విధానం రూపొందించాలన్నారు. చీఫ్ సెక్రటరీ, ఇతర ఉన్నతాధికారులతో ఒక హై లెవెల్ కమిటీ వేసి తెలంగాణ విద్యార్థులకు అడ్మిషన్స్ విషయంలో అన్యాయం జరగకుండా చూడాలని మరొకసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.