పీవీ స్ఫూర్తితో ముందుకు సాగుతాం : CM KCR
'తెలంగాణ ఠీవి మన పీవీ' అని సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు.
దిశ, తెలంగాణ బ్యూరో : 'తెలంగాణ ఠీవి మన పీవీ' అని సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు. వారి స్పూర్తితో దేశాభివృద్ధి దిశగా ముందుకు సాగుతామన్నారు. క్లిష్ట సమయంలో దేశాన్ని కాపాడిన తెలంగాణ ముద్దుబిడ్డ, పీవీ నర్సింహారావు అని అన్నారు. నాడు వారు ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల ఫలాలే నేడు దేశ ప్రజల అనుభవంలోకి వచ్చాయని తెలిపారు. బుధవారం పూర్వ భారత ప్రధాని పీవీ నరసింహరావు 102వ జయంతి సందర్భంగా సీఎం ఆయన సేవలను స్మరించుకున్నారు.
స్థితప్రజ్ఞతతో భారతదేశాన్ని ప్రపంచ అగ్రదేశాల సరసన నిలిపేందుకు పునాది వేసిన దార్శనికుడు, తనదైన శైలిలో రాజనీతిని, పాలనా దక్షతను ప్రదర్శిస్తూ..'దేశానికి మౌనంగా మేలు చేసిన భారత ప్రధాని పీవీ నర్సింహారావు' అని సీఎం కొనియాడారు. పలు సంస్కరణలతో భారతదేశ ఔన్నత్యాన్ని కాపాడిన ఘనత తెలంగాణ బిడ్డ పీవీ నర్సింహారావుకే దక్కుతుందని తెలిపారు. పీవి సేవలను సమున్నతంగా గౌరవించుకునే బాధ్యత మన మీద ఉందన్నారు. వారి గొప్పతనాన్ని గుర్తించుకునేందుకు వారి జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదని సీఎం అన్నారు.