ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకుందాం.. : రేవంత్ రెడ్డి
కల్వకుంట్ల పాలనను రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తరిమికొట్టాలని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు.
దిశ, ఆర్మూర్: సోనియాగాంధీ చలువతో ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబీకుల రాక్షస పాలన కొనసాగుతుందని, కల్వకుంట్ల పాలనను రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తరిమికొట్టాలని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకుందామని తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి సంక్షేమం అభివృద్ధి అందేలా చేసే బాధ్యత తనదని రేవంత్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలో శుక్రవారం రాత్రి హాథ్ సే హాథ్ జోడోయాత్ర లో భాగంగా ఆర్మూర్ మున్సిపల్‌లోని పెర్కిట్ శివారు నుంచి కొటార్మూర్, మామిడిపల్లిల మీదుగా ఆర్మూర్‌లోని పాత బస్టాండ్ వరకు రైతులు, మైనార్టీలు, దళితులు, యువకులు, పిల్లలతో కలిసి యాత్ర చేపట్టి కార్నర్ మీటింగ్లో రేవంత్ రెడ్డి మాట్లాడారు.
మొదట యాత్రకు భారీ స్థాయిలో తరలివచ్చిన అశేష జనవాహానికి రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ప్రజల అభీష్టాన్ని చూసి సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగిందన్నారు. కానీ తెలంగాణ ప్రజలు కేసీఆర్ వాగ్దానాలకు మోసపోయి కాంగ్రెస్‌ను ఓడించి రెండు పర్యాయాలు బీఆర్ఎస్‌ను గెలిపించారన్నారు. కానీ కేసీఆర్ ప్రజలకు ఇస్తానన్న డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, కేజీ టు పీజీ విద్య, ఇంటికో ఉద్యోగం, దళితులకు మూడు ఎకరాల భూమి, 12 శాతం మైనార్టీలకు, ఎస్టిలకు రిజర్వేషన్, రైతులకు లక్ష రుణమాఫీ, వంద పడకల ఆసుపత్రి హామీలన్నీ మూటలుగానే మిగిలాయన్నారు.
ఇక్కడి ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి దుబాయ్ వాళ్లకు ధోకా చేసి దుబాయ్ షేకులకు టోపీ పెట్టాడన్నారు. ఆర్మూర్ ప్రాంతంలో తలారి సత్యం హత్య చేయించడంతోపాటు, మాక్లూరులో ఓ జర్నలిస్ట్‌పై దాడులు చేయించడాన్నారు. గౌడ కులానికి చెందిన సర్పంచ్‌పై అక్రమ కేసులు బనాయించడం ఎమ్మెల్యే జీవన్ రెడ్డికే చెల్లిందన్నారు. దక్షిణఫ్రికాలో ఈడి అమీన్ ఉండేవారని, అదే తరహాలో ఆర్మూర్‌కు ఈడి అమీన్‌లా జీవన్ రెడ్డి ఉన్నాడన్నారు. ఆర్మూర్ ప్రాంతంలోని ప్రజలపై జీవన్ రెడ్డి అఘాయిత్యాలు నిత్యకృత్యం అయ్యాయని ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చర్మం ఒలిచి ప్రజలకు చెప్పులు కుట్టిస్తామని రేవంత్ రెడ్డి అన్నారు.
ఆర్మూర్ ప్రాంతంలో ఏ రియల్ ఎస్టేట్ వెంచర్ వేయాలన్న సదరు వ్యాపారస్తులు ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి, ఆయన సోదరుడికి రెండు వేల గజాల స్థలాన్ని ఇచ్చు కోవాలట అని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఆర్మూర్‌లో జీవన్ రెడ్డి ఆర్టీసీకి కోట్ల రూపాయల బకాయిలు ఉండి దానికి జీవన్ రెడ్డి మాల్ అని రాయించుకోవడం సిగ్గుచేటు అన్నారు. నందిపేట మండలంలోని లక్కంపల్లి సెజ్‌లో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మాజీ ఎంపీ కవితల అవినీతి, కమిషన్ల ధన దాహానికి లక్కంపల్లి సెజ్ దివాలా తీసిందన్నారు. లక్కంపల్లి సెజ్ పూర్తయి పరిశ్రమలు మొదలైతే 10 నుంచి 15 వేల మంది యువకులకు ఉపాధి లభించేదన్నారు.
నిజాం పాలనలో అప్పట్లో పూర్తిచేసిన నిజాంసాగర్‌తో రైతులు పంటలు పండించగా, కాంగ్రెస్ పాలనలో పూర్తి చేసిన శ్రీరామ్ సాగర్, పోచారం, గుత్ప, అలీ సాగర్ ప్రాజెక్టులతో రైతులు పుష్కలంగా పంటలు సాగు చేశారన్నారు. కానీ గత తొమ్మిదేళ్లుగా బీఆర్ఎస్ పాలనలో రైతులకు కొత్తగా చేసింది ఏం లేదన్నారు. రానున్న ఎన్నికల్లో ఆర్మూర్‌తోనే కాంగ్రెస్ గెలుపు ప్రారంభం కావాలని, ఆర్మూర్ నాకు అచ్చచ్చిన ప్రాంతమని రేవంత్ రెడ్డి అన్నారు. 2019లో ఆర్మూర్ రైతు దీక్షలోనే పాల్గొని రైతు దీక్ష సక్సెస్‌తో తనకు పీసీసీ పదవి వచ్చిందని, అందువల్లనే తను ఆర్మూర్ సెంటిమెంట్‌గా భావిస్తున్నట్లు రేవంత్ రెడ్డి చెప్పారు.
కానీ గతంలో ఆర్మూర్‌కు ప్రాతినిధ్యం వహించిన సురేష్ రెడ్డి కాంగ్రెస్‌ను వంచించి బానిస బతుకులు బతికేందుకు బీఆర్ఎస్ బాట పట్టారని రేవంత్ రెడ్డి మండి పడ్డారు. 2019లో ఆర్మూర్ కాంగ్రెస్ అభ్యర్థి ఆకుల లలిత కార్యకర్తలు నిండా ముంచి బీఆర్ఎస్ పార్టీలో చేరిందన్నారు. నాయకులు ఎవరు ఏ పార్టీకి వెళ్లిన ఆర్మూర్ కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీ వెంటనే ఉన్నట్లు ఈ కాంగ్రెస్ కార్నర్ మీటింగ్‌ను బట్టి తెలుస్తుందన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టి కేసిఆర్‌కు బైబై చెప్పాలన్నారు. అదేవిధంగా గత ఎన్నికల్లో మాజీ ఎంపీ కవితకు ఇచ్చిన తరహా తీర్పునే ఐదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని బాండ్ రాసి ఇచ్చి మోసగించిన ప్రస్తుత ఎంపీ ధర్మపురి అరవింద్ సైతం జిల్లా ప్రజలు తీర్పు ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఐదు లక్షలతో ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇంటిని నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
రూ. 2 లక్షల రూపాయల వరకు ఆరోగ్య శ్రీ ద్వారా వైద్యం అందేలా చేస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. వీటితోపాటు రెండు లక్షల రైతు రుణమాఫీ, రెండు లక్షల మందికి ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. నిరుద్యోగులను తొమ్మిదేళ్లుగా ఎలాంటి నోటిఫికేషన్లు లేకుండా కేసీఆర్ వారి జీవితాలతో చెలగాటమాడుతున్నాడన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మహిళలకు 500 రూపాయలకే ఇంటికి సిలిండర్ వచ్చేలా చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ ఆలీ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఈరవత్రి అనిల్, మహేష్ కుమార్ గౌడ్, ఏబి. శ్రీనివాస్ ( చిన్న), కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు అంజన్ కుమార్ యాదవ్, మల్ రెడ్డి రంగారెడ్డి, భూపతిరెడ్డి, గాలి అనిల్ కుమార్, గడుగు గంగాధర్, నగేష్ రెడ్డి, కేశ వేణు, భాగ్య, మార చంద్రమోహన్, విట్టం జీవన్, కోల వెంకటేష్, ఇటేడి బాజన్న, లక్కారం లక్ష్మీనారాయణ, మంథని వెంకట్రాంరెడ్డి, చేపూర్ చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.