హైదరాబాద్‌లో బయటపట్ట మరో 'రియల్' మోసం.. కేసులు నమోదైనా బేఫికర్‌గా ఓనర్లు ..!
ఎలాంటి అనుమతులు ఉండవు.. పునాది కూడా పడదు.. అయినా ప్రాజెక్టులు, వెంచర్ల పేరుతో కొన్ని కంపెనీలు విస్తృత ప్రచారం చేస్తూ కోట్లు కూడబెట్టుకుంటున్నాయి.
ప్రీ లాంచ్ స్కామ్స్‌కు తెలంగాణ కేరాఫ్ అడ్రస్‌గా మారింది. దేశంలో ఎక్కడా లేని విధంగా స్టేట్‌లో బడా కంపెనీలు ఎంట్రీ ఇస్తున్నాయి. మోసపూరిత ప్రచారం చేస్తూ కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. ప్రాజెక్టులు ప్రారంభించకముందే రూ.వందల కోట్లు కూడబెట్టుకుంటున్నాయి. నిధులను దారిమళ్లించి వినియోగదారులను నిండాముంచుతున్నాయి. మోసాల నియంత్రణలో 'రెరా' విఫలం కాగా.. పాలకులు పట్టించుకోకపోవడం విస్మయానికి గురి చేస్తున్నది. ఈ సంస్థల యజమానులకు పొలిటికల్ లీడర్లతోపాటు ఆఫీసర్ల ఫుల్ సపోర్టు ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. అందుకే ఓనర్లపై చర్యలకు సర్కారు వెనకాడుతున్నట్లు తెలుస్తున్నది.
దిశ, తెలంగాణ బ్యూరో: ఎలాంటి అనుమతులు ఉండవు.. పునాది కూడా పడదు.. అయినా ప్రాజెక్టులు, వెంచర్ల పేరుతో కొన్ని కంపెనీలు విస్తృత ప్రచారం చేస్తూ కోట్లు కూడబెట్టుకుంటున్నాయి. స్టేట్‌లో సాహితీ స్కామ్‌తో ఇప్పటికే వందలాది మంది నిండా మునిగారు. తాజాగా జయంత్రి రిలయబిలిటీస్ ఫ్రాడ్ బయటపడుతున్నది. ఫార్చూన్ 99 హోమ్స్, ఏవీ ఇన్ఫ్రాకాన్, యోషితా ఇన్ఫ్రా దందాలు సైతం వెలుగుచూస్తున్నాయి. గతంలో భువనతేజ, ఆర్ జే గ్రూప్, జయ గ్రూప్, పారిజాత డెవలపర్స్, ఐరా రియాల్టీ, ఈఐపీఎల్, హాల్ మార్క్ కన్ స్ట్రక్షన్స్, అర్బన్ రైజ్, సుమధుర.. ఇలా ఎన్నెన్నో కంపెనీలపై అనేక ఆరోపణలు వచ్చాయి. ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేరిట బెంగుళూరుకు చెందిన ప్రెస్టేజ్ ఎస్టేట్స్ సైతం కోకాపేటలోని క్లోయిర్మోంట్ ప్రాజెక్టుల్లో భారీగా వసూళ్లు చేసిందనే ఆరోపణలున్నాయి.
ఆఫీసర్లు, లీడర్ల సపోర్ట్!
రాష్ట్రంలో 'రియల్' మోసాల నియంత్రణలో 'టీఎస్ రెరా' విఫలమైంది. సాహితీ ఉదంతం వెలుగులోకి వచ్చిన తర్వాత కూడా పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ రివ్యూ చేయకపోవడం విస్మయానికి గురి చేస్తున్నది. బీఆర్ఎస్ నాయకుల పాత్ర ఇలాంటి దందాల్లో ఉందనే ఆరోపణలున్నాయి. అంతేకాకుండా అధికారుల మద్దతు ఉందని తెలుస్తున్నది. ఈ కంపెనీలన్నీ కస్టమర్ల దగ్గర వసూలు చేసిన డబ్బులతో ప్రాజెక్టులు పూర్తి చేయకుండా మరో చోట భూములను కొనుగోలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అందుకే ఒక చోట ప్రాజెక్టు పూర్తి కాకముందే మరో చోట వెంచర్, అపార్ట్ మెంట్లను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. నిబంధనల ప్రకారం నిర్మాణాల్ని చేపట్టని ఏ ఒక్కరి పైనా అధికారులు సుమోటోగా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.
నిండా ముంచిన 'జయంత్రి'
హైదరాబాద్ లో జయంత్రి రిలయబిలిటీస్ అనే కంపెనీ సామాన్యులను నిండా ముంచింది. పాటిఘనపూర్, అమీన్ పూర్, చందానగర్, నిజాంపేట, తోల్కట్ట, సదాశివపేట, షాద్నగర్, రాయదుర్గం, లింగంపల్లి, సర్దార్ పటేల్ నగర్ తదితర ప్రాంతాల్లో ప్రీ లాంచ్ పేరిట ముందే డబ్బులు వసూలు చేసింది. గోపన్ పల్లి ప్రాజెక్టులో పూర్ణచందర్ రావు గూడిపూడి, వెంకటేశ్ కామినేని, తోట అర్చన, నమ్రత పందిరి వంటి తదితరులు పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తున్నది. కంపెనీ ఎండీ కాకర్ల శ్రీనివాస్, అతని అనుచరగణం వసూళ్లకు పాల్పడ్డారు. రూ.కోట్లను దారి మళ్లించారు. విషయం తెలుసుకున్న కస్టమర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ లోనే ఎనిమిది కేసులు నమోదయ్యాయి. ఆయన అరెస్టుతో వందలాదిగా బాధితులు కూకట్ పల్లి లోని జయంత్రి గ్రూప్ ఆఫీసుకి పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. 2020 నుంచి ప్రీలాంచ్ పేరుతో విక్రయాలు చేస్తున్నాడని, గోపనపల్లి లోని ప్రాజెక్ట్ లో తాము కూడా డబ్బులు కట్టామని మొర పెట్టుకోవడంతో పోలీసు స్టేషన్లలో కేసులు నమోదు చేస్తున్నారు.
ఎన్నెన్నో కంపెనీలు
హైదరాబాద్ లో సాహితీ, జయంత్రి, భువనతేజ, ఆర్ జే గ్రూప్, జయ గ్రూప్, పారిజాత డెవలపర్స్, ఏవీ ఇన్ ఫ్రా కాన్, ఫార్చ్యూన్ 99 హోమ్స్, యోషితా ఇన్ఫ్రా, ఐరా రియాల్టీ, ఈఐపీఎల్, హాల్ మార్క్ కన్ స్ట్రక్షన్స్, అర్బన్ రైజ్, సుమధుర.. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మంది డెవలపర్లు ప్రీ లాంచ్ పేరుతో ప్లాట్లు, ఫ్లాట్లను విక్రయిస్తున్నారు. వీరిలో ఎంతమంది సకాలంలో ఫ్లాట్లను కొనుగోలుదారులకు అందించగలిగే సత్తా ఉంది? ఎంతమందికి విక్రయించారు? బయ్యర్ల నుంచి వసూలు చేసిన సొమ్మెంత? నిర్మాణాల తాజా పరిస్థితి ఏమిటి? ఎప్పుడు పూర్తి చేస్తారు? ఆయా సంస్థల ఆర్థిక స్థితిగతులేమిటి? వంటి వివరాల్ని తెలంగాణ రెరా అథారిటీ తక్షణమే సేకరించాలి. దాని ద్వారా రేపు ఈ సంస్థలు బోర్డు తిప్పేసినా కస్టమర్లకు న్యాయం చేసే వీలు కలుగుతుంది.