హిందువులపై వేధింపులు మానుకోండి: ట్రాఫిక్ పోలీసులకు VHP హెచ్చరిక

ట్రాఫిక్ పోలీసులు హిందువులపై కక్ష కట్టారని విశ్వహిందూ పరిషత్ నేతలు విమర్శలు చేశారు.

Update: 2023-05-31 17:28 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ట్రాఫిక్ పోలీసులు హిందువులపై కక్ష కట్టారని విశ్వహిందూ పరిషత్ నేతలు విమర్శలు చేశారు. ముస్లింలు సనత్ నగర్ నుంచి భరత్ నగర్ వరకు ఫుట్ పాత్‌తో పాటు సగం మెయిన్ రోడ్డు ఆక్రమించుకున్నా పట్టించుకోని పోలీసులు.. దేవాలయాలకు వచ్చి పార్క్ చేసుకునే వారికి చలాన్లు విధించడంపై బుధవారం ఒక ప్రకటనలో తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఒక్కో బండికి 30 నుంచి 40 చలాన్లు కూడా విధించిన సందర్భాలు ఉన్నాయని, ప్రముఖంగా బోయిన్ పల్లి సమీపంలోని తాడ్ బాండ్ హనుమాన్ దగ్గర ఈ ఘోరం విపరీతంగా జరుగుతోందని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు సురేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఆలయాల వద్ద కఠిన ఆంక్షలు అమలు చేస్తున్న ట్రాఫిక్ పోలీసులు ప్రతి శుక్రవారం రోడ్లు బంద్ చేసి మసీదులకు వెళ్లి రాకపోకలకు అంతరాయం కలిగిస్తున్నా వారివైపు కనీసం కన్నెత్తి కూడా చూడటం లేదని ధ్వజమెత్తారు. గత శుక్రవారం షేక్ పేట ఓయూ కాలనీ బీమాస్ హోటల్ పక్కన మసీదు వద్ద పలువురు రోడ్డు బందు చేసి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారని, ఇది దాదాపు నెల రోజులుగా సాగుతున్నా ఎవరూ పట్టించుకోవడంలేదన్నారు. బజరంగ్ దళ్ నేత రుద్ర బ్రహ్మం స్పందించి ఆ సమస్యను పరిష్కరించారని ఆయన చెప్పారు. సనత్ నగర్ భరత్ నగర్ వరకు మెంటల్ ఆస్పత్రి దగ్గర మెయిన్ రోడ్డును సగం ఆక్రమించుకొని ముస్లింలు వ్యాపారాలు చేస్తున్నా పోలీసులు పట్టించుకోకపోవడం దుర్మార్గమని సురేందర్ రెడ్డి ఫైరయ్యారు.

లంగర్ హౌస్ రోడ్డు నుంచి సన్ సిటీకి వెళ్లే ఫుట్ పాత్ మొత్తం ఆక్రమించుకొని వ్యాపారాలు చేస్తున్నారని, అయినా పట్టించుకోవడంలేదన్నారు. పోలీసుల ఇబ్బందులు తాళలేక హిందువులు ఆలయాలకు రావడమే గగనంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ముఖ్యంగా తాడ్ బాండ్ హనుమాన్ ఆలయం వద్ద పవన్ అనే కానిస్టేబుల్ హిందూ భక్తులపై దురుసుగా ప్రవర్తిస్తున్నాడని, ఆయన్ను వెంటనే సస్పెండ్ చేయాలని కూడా విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. సనత్ నగర్ నుంచి భరత్ నగర్ వరకు రోడ్డును అక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకుని రాకపోకలకు ఇబ్బంద లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. లేదంటే విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలే తప్పవని సురేందర్ రెడ్డి హెచ్చరించారు.

Tags:    

Similar News