గ్రామాల్లో ఎన్నికల సందడి.. సర్పంచ్ ఎన్నికలకు రెడీ అవుతున్న నాయకులు
ఇంకా ఎన్నికల షెడ్యూల్ విడుదల కానేలేదు. ఎన్నికలెప్పుడు జరుగుతాయో స్పష్టత లేదు. బరిలో ఉండే అభ్యర్థులెవరో తేలనేలేదు. ప్రచారం మొదలుపెట్టనే లేదు.
దిశ, షాద్‌నగర్ : ఇంకా ఎన్నికల షెడ్యూల్ విడుదల కానేలేదు. ఎన్నికలెప్పుడు జరుగుతాయో స్పష్టత లేదు. బరిలో ఉండే అభ్యర్థులెవరో తేలనేలేదు. ప్రచారం మొదలుపెట్టనే లేదు. కానీ రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజక వర్గంలో ఎన్నికల వాతావరణం ఊపందుకున్నది. ఎక్కడికక్కడ స్థానిక సంస్థల ఎన్నికల రాజకీయ సందడి నెలకొన్నది. రేపోమాపో ఎన్నికలు జరుగబోతున్నాయా అనేలా పరిస్థితులు ప్రతిబింబిస్తున్నాయి. సాధారణంగా ఎన్నికల ప్రచారంలో ప్రజల నుంచి పార్టీలకు మద్దతు లభిస్తుంటుంది. కానీ ఎన్నికల ప్రక్రియ తెరమీదకు రాకముందే నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామాల్లో బరిలో ఉండే వారి మద్దతుకోసం గ్రామంలో ముఖ్యమైన నాయకులతో మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
ఆశావహులు విస్తృత సమావేశాలు జరుపుతున్నారు. ఏకగ్రీవం కోసం నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రామ పెద్దల తీర్మానాల మేరకు ఎన్నికలు జరగనున్నాయి. మరికొన్ని గ్రామాల్లో నువ్వా..? నేనా..? అనే పోటీ నెలకొంది. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు సైతం ఈసారి కచ్చితంగా గెలిచేలా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రజలు సైతం సానుభూతి వ్యక్తం చేస్తూ గెలిపిస్తామంటూ హామీలు ఇస్తున్నారు. ఇక ప్రముఖ రాజకీయ పార్టీల నాయకులు పోటాపోటీగా అగ్రనేతలను కలిసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. నియోజకవర్గ నాయకుల మద్దతు కోసం ఆశావహులు ఎవరికివారు ప్రయత్నాలు సాగిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీల గెలుపు కోసం విశేషంగా శ్రమించిన నాయకులు పోటీకి ఆసక్తి చూపుతున్నారు.
సన్నాహక సమావేశాలు..
గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికల కోసం ఆశావహులు తమకు అనుకూలంగా మద్దతుగా నిలిచే వారిని ఓ చోట చేర్చి సన్నహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. గ్రామ పెద్దలు, యువకులు, యువజన సంఘాల సభ్యుల మద్దతు కూడగడుతూ తమ వైపు తిప్పుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తూ సన్నాహక సమావేశాలతో మమేకమవుతున్నారు.
మద్దతు కోసం మందు పార్టీలు..
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీలో నిలిచేందుకు తహతహలాడుతున్న సర్పంచ్ అభ్యర్థులు గ్రామాల్లో మందు పార్టీలు ఏర్పాటు చేస్తున్నారు. వృద్ధులు, యువకులు, యువజన, కుల సంఘాల సభ్యులను ప్రలోభ పరిచేందుకు మందు పార్టీలను ఎర వేస్తున్నారు. మద్యం ప్రియులు సైతం అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ నిత్యం ముక్క, సుక్కతో ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది.
పెరుగుతున్న పోటీ..
గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ రాకన్నాముందే ఆశావహులు ఇప్పటినుంచే తామంటే తాము బరిలో నిలుస్తున్నామంటూ విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. దీంతో గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పదవికి పోటాపోటీగా ఆశావహులు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఎంత ఖర్చయినా భరిస్తూ పోటీలో నిలిచి గెలుస్తామంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. గతంలో స్వల్ప మెజారిటీతో ఓడిన అభ్యర్థులు సైతం ఈసారి కచ్చితంగా గెలిచి తీరుతామని ప్రణాళికలను సైతం రూపొందించుకుంటున్నారు. అందులో భాగంగా గ్రామ ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు మాటామంతీ కలుపుతున్నారు. ఈసారైనా గెలిపించాలంటూ వేడుకుంటున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ రాలేదు.. రిజర్వేషన్లు కూడా ఖరారు కాలేదు.. కానీ ఇప్పటినుంచే గ్రామపంచాయతీ ఎన్నికల సందడి గ్రామాల్లో నెలకొంది.