నేడే లాసెట్ నోటిఫికేషన్.. మార్చి 1 నుంచి దరఖాస్తులు
మూడేండ్లు, ఐదేండ్ల లా కోర్సులతో పాటు ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే లాసెట్, పీజీఎల్ సెట్ నోటిఫికేషన్ బుధవారం విడుదల కానుంది.
దిశ, తెలంగాణ బ్యూరో: మూడేండ్లు, ఐదేండ్ల లా కోర్సులతో పాటు ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే లాసెట్, పీజీఎల్ సెట్ నోటిఫికేషన్ బుధవారం విడుదల కానుంది. కాగా, మార్చి 1వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నట్లు సెట్ కన్వీనర్ బీ.విజయలక్ష్మి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. లాసెట్ దరఖాస్తుకు రూ.900 చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కాగా ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.600 గా ఫీజు నిర్ణయించారు. పీజీఎల్‌సెట్ దరఖాస్తు ఫీజుగా రూ.1100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.900గా నిర్ణయించారు. ఇదిలా ఉండగా దరఖాస్తుల స్వీకరణకు ఏప్రిల్ 15వ తేదీ వరకు గడువు విధించారు. కాగా రూ.500 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 25వ తేదీలోపు, రూ.1000 లేట్ ఫీజుతో మే 5వ తేదీ లోపు, రూ.2 వేల ఆలస్య రుసుముతో మే 15వ తేదీలోపు, రూ.4 వేల లేట్ ఫీజుతో మే 25వ తేదీలోపు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు.
మే 20వ తేదీ నుంచి 25వ తేదీ మధ్యలో దరఖాస్తుల్లో తప్పొప్పుల సవరణకు అవకాశం కల్పించారు. మే 30వ తేదీ నుంచి హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. కాగా లాసెట్, పీజీఎల్‌సెట్ రాతపరీక్షలను జూన్ 3వ తేదీన కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహించనున్నారు. మూడేండ్ల కోర్సులో చేరేవారికి ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరగనుంది. ఐదేండ్లు, పీజీఎల్‌సెట్ రాతపరీక్ష మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరగనుంది. కాగా ప్రాథమిక కీని జూన్ 6న విడుదల చేయనున్నారు. ప్రాథమిక కీలో అభ్యంతరాలను జూన్ 7వ తేదీ వరకు స్వీకరించనున్నారు. ఆపై తుది ఫలితాలను ప్రకటించనున్నారు.