రూ.500 కోట్లు విలువ చేసే భూమి కబ్జా.. అక్రమ నిర్మాణాలు కూల్చివేత

కబ్జాదారులు మాకు ఏది అతీతం కాదు అన్న చందంగా యదేచ్ఛగా హెచ్ఎండిఏ భూములను కబ్జా చేశారు.

Update: 2023-03-28 03:51 GMT

దిశ, శంషాబాద్ : కబ్జాదారులు మాకు ఏది అతీతం కాదు అన్న చందంగా యదేచ్ఛగా హెచ్ఎండిఏ భూములను కబ్జా చేశారు. రూ.500 కోట్ల విలువైన 50 ఎకరాల భూమిని ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టారంటే ఎంతగా రెచ్చిపోయారో అర్థం చేసుకోవచ్చు. వారం రోజుల క్రితం అక్రమ నిర్మాణాలకు కూల్చడానికి వచ్చిన హెచ్ఎండిఏ అధికారులు, పోలీసుల‌పై రాళ్ల దాడి చేసిన ఘటన అందరికీ తెలిసిందే. తాజాగా రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సింప్లెక్స్ వద్ద ఉన్న సర్వేనెంబర్ 721, 724, 729లో దాదాపు 180 ఎకరాలు హెచ్ఎండిఏకి సంబంధించిన భూములు ఉన్నాయి.

ఈ భూములలో కబ్జాదారులు దాదాపు 50 ఎకరాలకు పైగా ఆక్రమణలు చేసి ప్రహరీలు నిర్మించి షెడ్డులు సైతం నిర్మించారు. అధికారులకు హెచ్ఎండిఏ భూముల కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టారని ఫిర్యాదు రావడంతో హెచ్ఎండిఏ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆధ్వర్యంలో మంగళవారం భారీ పోలీసు బందోబస్తు మధ్య ఆరు జేసీబీలతో అక్రమ నిర్మాణాలను పూర్తిగా నేలమట్టం చేశారు. మరోసారి అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎండిఏ ఈవో గంగాధర్, ఏఈఓలు జనార్ధన్, జోగారావు, హెచ్ఎండిఏ తహసిల్దార్ ముంతాజ్, ఇన్స్‌పెక్టర్ వెంకటేష్, ఎస్సై సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రజాప్రతినిధి అల్లుడు సైతం..  

వారం రోజుల క్రితం కూల్చడానికి వచ్చిన హెచ్ఎండిఏ అధికారులపై అక్రమదారులు రెచ్చిపోయి రాళ్లదాడి చేశారు. ఈ దాడిలో నలుగురు అధికారులకు గాయాలయ్యాయి. ఆ కేసులో ఐదుగురిని అరెస్టు చేసి కేసులు నమోదు చేశారు. హెచ్ఎండిఏ భూమి ఆక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధి అల్లుడు సైతం 10 ఎకరాలు కబ్జా చేసినట్లు తెలిసింది. హెచ్ఎండిఏ భూమిలో పది ఎకరాల భూమిని ఓ స్థానిక ప్రజాప్రతినిధి అల్లుడు ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టి మున్సిపల్ అధికారులతో కుమ్మక్కై ఇంటి నెంబర్ సైతం జారీ చేయించుకున్నారు. ఇంటి నెంబర్ ఆధారంగా శంషాబాద్ సబ్ రిజిస్టర్ హెచ్ఎండిఏ భూములనే రిజిస్ట్రేషన్ చేసి స్వామి భక్తి చాటుకున్నాడు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..