డిమాండ్ల సాధనకు ఉద్యమిస్తున్న.. ఉద్యోగ, కార్మిక సంఘాలు

తెలంగాణ రాష్టంలో ఉద్యోగులను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటాం..

Update: 2023-08-18 16:58 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్టంలో ఉద్యోగులను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటాం.. ఈ రాష్టం అని రంగాల్లో వృద్ధి సాదిస్తుందంటే.. ఉద్యోగులు ఎంతో కష్టపడి పనిచేయడం వల్లే సాధ్యపడిందని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాటలు.. కానీ వాస్తవపరిస్థితులు ఇందుకు బిన్నంగా ఉన్నాయని ఉద్యోగ సంఘాల నేతలు, కార్మిక సంఘాల నాయకులూ ఆరోపిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వివిధ శాఖల్లో తాత్కాలిక ఉద్యోగులుగా రెండు లక్షలు పైగా పనిచేసేవారు. తెలంగాణ ఉద్యమం సమయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే కాంట్రాక్టు వ్యవస్థే ఉండదని, అందరినీ రెగ్యులర్ చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. రాష్ట్రం ఏర్పడి 9 ఏండ్లు పూర్తయినా కేసీఆర్​అన్న మాటలు పూర్తి స్థాయిలో అమలు కాలేదు. పీఆర్సీ ప్రకారం వేతనాలు ఇవ్వటం లేదు. కారణం ఏమిటంటే వారంతా అవుట్​సోర్సింగ్ సిబ్బంది అని దాటవేస్తున్నారు .

రాష్ట్రవ్యాప్తంగా గ్రామపంచాయతీల్లో పనిచేస్తున్న కార్మికులు దాదాపు 60 వేల మంది జులై 6 నుంచి నిరవధిక సమ్మె బాటపట్టారు. పీఆర్సీ నిర్ణయించిన వేతనాలు అమలుకు జీవో నెంబర్ 66 ను ప్రభుత్వం విడుదల చేసింది. దాని ప్రకారం స్వీపర్లకురూ.15,600, ఇతర క్యాటగిరి కార్మికులకు రూ.19 వేలు నుంచి రూ.31,640 వరకూ- ఇవ్వాలని, పర్మినెంట్ చేయాలని, 8 గంటల పని, సెలవులు, ప్రమాద నష్టపరిహారం తదితర చట్టబద్ధ సౌకర్యాలు అమలు చేయాలని కోరుతూ వారు సమ్మెకు దిగారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన జీపీలతో రాష్ట్రంలో మొత్తం12,769 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.

2011 జనాభా లెక్కల ప్రకారం జీపీల్లో పారిశుద్ధ్య పనుల కోసం ఉన్న కార్మికుల సంఖ్య 60 వేలు మాత్రమే. ఇప్పటి జనాభా ప్రకారం అయితే.. రెట్టింపు సంఖ్యలో కార్మికులను నియమించాల్సి ఉంటుంది. పెరుగుతున్న జనాభాకు, కొత్త గ్రామపంచాయతీల ఏర్పాటుకు తగినట్టుగా గ్రామపంచాయతీలకు అదనపు సిబ్బందిని రాష్ట్ర సర్కారు నియమించడం లేదు. కొన్ని గ్రామపంచాయతీలు అదనపు సిబ్బందిని పెట్టుకున్నప్పటికీ ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదు. వీరికి చట్టబద్ధమైన హక్కులు, సౌకర్యాలు అమలులో లేవు. సెలవులు, ఈపీఎఫ్, యూనిఫామ్, ఈఎస్ఐ, సబ్బులు, మంచి నూనె, చెప్పులు వంటి అలవెన్సులు ప్రభుత్వం ఇవ్వడం లేదు.

మిషన్ భగీరథలో పనిచేస్తున్న16 వేల కాంట్రాక్టు కార్మికులను ఏజెన్సీలకు అప్పజెప్పింది. ఆయా ఎజెన్సీలు అతి తక్కువ వేతనాలు ఇస్తూ, ఇతర అలవెన్సులు, సెలవులు ఏమీ అమలు చేయడం లేదు. ఇచ్చే అతి తక్కువ వేతనాలు 3,4 నెలలకు ఒకసారి చెల్లిస్తున్నారు . దీని కారణంగా కార్మికులు కనీస వేతనాలు ఇవ్వాలని, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పిస్తూ రెగ్యులర్ చేయాలని కొన్ని నెలలుగా ఆందోళన చేస్తున్నారు.

రాష్ట్రములో వివిధ శాఖల్లో పనిచేస్తున్న రెగ్యులర్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు ,ఔట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఉద్యోగ సంఘాల నేతలు విమర్శిస్తున్నారు . విద్య శాఖలో సర్వశిక్షా అభియాన్, కెజిబివి లో పనిచేసే ఉపాధ్యాయులు, ఎస్ ఓ లు అలాగే , రెగ్యులర్ టీచర్లకు సంబంధించి స్పౌస్ కేసులు, బదిలీల ప్రక్రియ, పీఆర్సీ అమలు, సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ అమలు చేయాలనీ డిమాండ్లను పెద్దఎత్తున పోరాటం చేస్తున్న ప్రభుత్వం ఈ డిమాండ్లపై ఏ హామీ ఇవ్వలేదు. అలాగే వైద్య ఆరోగ్య శాఖలో సెకండ్ ఏ ఎన్ ఎం లను క్రమబద్దీకరించాలని చేస్తున్న కేవలం చర్చలతో కాలయాపన చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు .

ఎన్నికల సమయం సమీపిస్తుతుండడంతో ఉదోగా కార్మిక సంఘాల నాయకులూ ప్రభుత్వం తో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్దమయ్యారు . ఈ రెండు మూడు నెలలో ఎపుడైనా ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందనే ప్రచారం జోరందుకోవడం ,ప్రధాన పార్టీలు సహితం తమ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటిస్తున నేపథ్యంలో కార్మిక ఉద్యోగ సంఘాల నాయకులూ తమ పోరాటానికి పదును పెట్టారు . ఇప్పుడు తప్పితే ఇక మరెప్పుడు పరిష్కారం కావని ఆలోచనతో వివిధ శాఖల ప్రధాన కార్యాలయాల వద్ద ధర్నా , మౌన దీక్ష , సమ్మెలు చేస్తూ ప్రభుత్వం పై పోరాటాన్ని ఉదృతం చేస్తున్నారు . ఎన్నికలు సమీపిస్తున్న వేళలో ప్రభుత్వం వీరి డిమాండ్లను నెరవేర్చుతుందా లేక సాగదీస్తుందా వేచి చూడాలి .

ఉద్యమ పార్టీ అని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలనే ఇప్పడు కాంట్రాక్టు, ఔట్ సోర్సు ఉద్యోగులు అడుగుతున్న న్యాయమైన డిమాండ్లు. అధికారంలోకి రావడానికి హామీల గుప్పించి ఇప్పుడు బీఆర్‌ఎస్ ప్రభుత్వం తప్పించుకుంటుంది. ఎన్నికలు సమిస్తున్న వేళలో ప్రభుత్వం ఉద్యోగుల కార్మికులకు ఇచ్చిన హామీలను చిత్తశుద్ధితో అమలు చేయాలి. లేదంటే వచ్చే ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలను చవిచూడాల్సి వస్తుంది. గత పాలకులకు వీరికి తేడా ఏముంది? - పాలడుగు భాస్కర్ సి ఐ టి యూ నాయకులు.


Similar News