TG: కేబినెట్ భేటీలో కీలకంగా చర్చించే అంశాలివే..!

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అద్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 23న జరగనున్నది.

Update: 2024-10-17 16:57 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అద్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 23న జరగనున్నది. సచివాలయంలో ఆ రోజు సాయంత్రం 4 గంటలకు జరిగే ఈ సమావేశానికి ప్రభుత్వం పలు కీలక అంశాలను ఇప్పటికే అజెండాలో పొందుపరిచింది. ఈ నెల చివర్లో అసెంబ్లీ సమావేశాలను నిర్వహించనున్నట్లు చాలా కాలంగా సచివాలయ వర్గాల నుంచి వస్తున్న సమాచారానికి అనుగుణంగానే ప్రత్యేక సెషన్‌ను నిర్వహించడంపై కేబినెట్ భేటీలో చర్చించే అవకాశమున్నది. ఈ సెషన్‌లో ప్రభుత్వం కొన్ని ఆర్డినెన్సుల స్థానంలో బిల్లులను సభలో ప్రవేశపెట్టాలని భావిస్తున్నది. ఇప్పటికే తీసుకొచ్చిన హైడ్రా ఆర్డినెన్సుతో పాటు హైదరాబాద్ శివారులోని గ్రామ పంచాయతీలను సమీపంలోని మున్సిపాలిటీలో విలీనం చేయడంపై ఇప్పటికే వెలువరించిన ఆర్డినెన్సు స్థానంలో బిల్లులను అసెంబ్లీలో చర్చకు పెట్టి ఆమోదింపజేసుకోవడం, కొత్త రెవెన్యూ చట్టాన్ని రూపొందించడం... తదితర అంశాలను కేబినెట్ భేటీలో చర్చకు రానున్నాయి.

మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుపై మంత్రివర్గ సమావేశంలో లోతుగా చర్చలు జరగనున్నట్లు సమాచారం. మూసీ నది ఒడ్డున (రివర్ బెడ్‌లో) ఉన్న ఇ,డ్లను ఖాళీ చేయించి నిర్వాసితులకు డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను కేటాయించడం, బఫర్ జోన్‌లో ఉన్న ఇండ్లు, అపార్టమెంట్లకు రిలీఫ్ (పునరావాస) ప్యాకేజీపై ఈ సమావేశంలో చర్చలు జరగనున్నట్లు తెలిసింది. అసెంబ్లీ ప్రత్యేక సెషన్‌లో దీనిపై ప్రభుత్వం తరఫున స్పష్టమైన ప్రకటన చేసే అవకాశమున్నది. మూసీ ప్రాజెక్టును విపక్షాలు సుందరీకరణ కోణం నుంచి చూస్తూ విమర్శలు చేస్తున్నందున కోటికి పైగా జనాభా హైదరాబాద్ నగరం, శివారులో నివసిస్తున్నందున వరదలు, వర్షాల సమయంలో ముంపుకు గురికాకుండా చూడడం ప్రధాన ఉద్దేశమనే అంశాన్ని అసెంబ్లీ వేదికగానే ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నది. ప్రత్యేక స్టేట్‌మెంట్‌తో పాటు ప్రతిపక్షాలు లేవనెత్తే సందేహాలను నివృత్తి చేయడానికి, విమర్శలకు అడ్డుకట్ట వేయడానికి అవసరమైతే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌ను కూడా ప్రదర్శించాలన్న ఆలోచనలు జరుగుతున్నాయి.

ఇప్పటికే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్శిటీ ఏర్పాటుపై చట్టాన్ని తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం... స్పోర్ట్స్ యూనివర్శిటీ స్థాపనకు సంబంధించి కూడా ఆర్డినెన్సును తీసుకురావడమో లేక నేరుగా ఈ సెషన్‌లోనే బిల్లు పెట్టి సభ ఆమోదం పొందడమో జరిగేలా ప్రణాళిక రూపొందింది. ఈ అంశాన్ని కూడా కేబినెట్ భేటీలో చర్చించి బిల్లు రూపకల్పనపై సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వనున్నది. దీనికి తోడు ఈ ఏడాది ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి 3 వేల ఇండ్ల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా నాలుగున్న లక్షల ఇందిరమ్మ ఇండ్లను ఫస్ట్ ఫేజ్‌లో భాగంగా నిర్మించాలనుకుంటున్నందున మార్గదర్శకాలపైనా, ప్రతీ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల కమిటీల ఏర్పాటుపైనా కేబినెట్ సమావేశంలో చర్చ జరగనున్నది. హడ్కో (హౌజింగ్ అండ్ అర్బన్ డెవల్మప్‌మెంట్ కార్పొరేషన్) నుంచి రుణాలను తీసుకుని ఈ ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టాలనుకుంటున్నది. పంచాయతీరాజ్ శాఖలో 350 పోస్టుల భర్తీకి సంబంధించి కూడా మంత్రివర్గ భేటీలో చర్చ జరగనున్నట్లు సచివాలయ వర్గాల సమాచారం.

ములుగు, పెద్దపల్లి జిల్లా కేంద్రాల్లో ఆర్టీసీ బస్సు డిపోలను నెలకొల్పేలా మంత్రివర్గ సమావేశం విధాన నిర్ణయం తీసుకోనున్నది. ములుగులో బస్సు డిపోను ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వంలోనే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే సీతక్క ప్రతిపాదనలు పెట్టారు. కానీ సాకారం కాకపోవడంతో ఇప్పుడు ఆ దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. ఏటూరునాగారం మండలాన్ని రెవెన్యూ డివిజన్ కేంద్రంగా అప్‌గ్రేడ్ చేసేలా కూడా కేబినెట్ సమావేశం నిర్ణయం తీసుకోనున్నది. వీటికి తోడు పెండింగ్‌లో ఉన్న పలు సాగునీటి ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేసేందుకు వీలుగా తక్కువ వడ్డీతో ఎక్కువ కాలంలో తీర్చేలా దీర్ఘకాలిక రుణాలను ఏషియా ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకు నుంచి సమకూర్చుకునేలా ఈ సమావేశంలో చర్చించనున్నట్లు ఇరిగేషన్ వర్గాల ద్వారా తెలిసింది. ఇప్పటికే మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాంకు నుంచి రుణాన్ని సమకూర్చుకోడానికి ప్రభుత్వం సంప్రదింపులు జరిపి ఒక అవగాహనకు వచ్చింది.

కులగణన, ఎస్సీ వర్గీకరణ, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ తదితర అంశాలపైనా ఈ సమావేశంలో చర్చించే అవకాశమున్నది.


Similar News