అవసరమైతే తల ఇస్తాం.. కానీ తల వంచం: పొత్తులపై కూనంనేని కీలక వ్యాఖ్యలు

‘ఆలు లేదు.. చూలు లేదు. కొడుకు పేరు సోమలింగం’ అన్నట్లు ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీతో పొత్తులకు సంబంధించి ఇంకా ఎటువంటి చర్చలు జరగలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు.

Update: 2023-04-24 16:18 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ‘ఆలు లేదు.. చూలు లేదు. కొడుకు పేరు సోమలింగం’ అన్నట్లు ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీతో పొత్తులకు సంబంధించి ఇంకా ఎటువంటి చర్చలు జరగలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. “ఏ పొత్తు అయినా అన్ని స్థాయిల కమిటీలలో చర్చించి, కేంద్ర పార్టీ సూచన మేరకు కమ్యూనిస్టు పార్టీలు నిర్ణయం తీసుకుంటాయి” అని స్పష్టం చేశారు. గౌరవప్రదంగా లేని ఎన్నికల పొత్తులకి కమ్యూనిస్టు పార్టీలు ఎప్పటికీ తలవొంచబోవన్నారు. గెలుపైనా, ఓటమైనా ముందుకు సాగుతూనే ఉంటాయని, ఏ పార్టీ దయాదాక్షిణ్యాలకు తలవొగ్గేదే లేదని స్పష్టం చేశారు. కమ్యూనిస్టు పార్టీలు ప్రజల కోసం పుట్టాయన్నారు. అధికారం లేకపోయినా వందేళ్లయినా పార్టీ ప్రతిష్టను ఎవ్వరూ తగ్గించలేరని పేర్కొన్నారు.

అవసరమైతే తల ఇస్తాం.. కానీ తల వంచబోమన్నారు. ఇది తమ పార్టీల నిబద్దత అని, ఎవరికి ఇష్టమున్నా.. లేకపోయినా అసెంబ్లీ ఎన్నికలలో గెలిచి ఉభయ కమ్యూనిస్టు పార్టీలు శాసనసభలోకి అడుగుపెడతాయన్నారు. జీవితాలను పణంగా పెట్టి కమ్యూనిస్టు పార్టీలను కాపాడుకుంటున్నామన్నారు. ఏ పార్టీ అయినా పోటీచేసే మొత్తం 119 స్థానాలు గెలుస్తాయని అనుకోవన్నారు. కమ్యూనిస్టులు గెలవలేకపోతే, పొత్తులో ఉన్న అధికార పార్టీ అయినా పోటీచేసే అన్ని స్థానాలు గెలువగలుగుతుందా అని ప్రశ్నించారు. రెండు లెఫ్ట్ పార్టీల కార్యదర్శులకు ఎమ్మెల్సీ పదవులు అంటూ ‘దిశ’ ప్రచురించిన కథనంపై ఆయన ప్రకటన రూపంలో పై వివరణ ఇచ్చారు.

Tags:    

Similar News