ఇంగ్లాండ్, అమెరికాలో కేటీఆర్ పర్యటన విజయవంతం
తెలంగాణకు పెట్టుబడులు.. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలే లక్ష్యంతో మంత్రి కేటీఆర్ చేపట్టిన ఇంగ్లాండ్, అమెరికా దేశాల పర్యటన విజయవంతంగా ముగిసింది.
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణకు పెట్టుబడులు.. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలే లక్ష్యంతో మంత్రి కేటీఆర్ చేపట్టిన ఇంగ్లాండ్, అమెరికా దేశాల పర్యటన విజయవంతంగా ముగిసింది. ఇంగ్లాండులో ఈ నెల 10 నుంచి 14వ తేదీవరకు, అమెరికాలో ఈ నెల 16 నుంచి 25వ తేదీవరకు పర్యటించారు. ఇంగ్లాండ్‌లోని లండన్, అమెరికాలోని న్యూయార్క్, వాషింగ్టన్, హ్యూస్టన్, హెండర్సన్, బోస్టన్‌లలో వివిధ కంపెనీల యాజమాన్యాలతో 80కి పైగా సమావేశాలు, 5 రౌండ్ టేబుల్ సమావేశాలతో పాటు రెండు కాన్ఫరెన్స్‌లలో మంత్రి పాల్గొన్నారు. తెలంగాణ అభివృద్ధి ప్రస్థానంలో భాగం అయ్యేందుకు సంతోషంగా ముందుకువచ్చాయి. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్, ఐటీ, ఐటీ ఆధారిత రంగాలు, మీడియా, ఎంటర్ టైన్‌మెంట్, ఏరో స్పెస్, రక్షణ, లైఫ్ సైన్సెస్, మెడికల్ డివైజెస్, డిజిటల్ సొల్యూషన్స్, ఇన్నోవేషన్, డేటా సెంటర్, ఆటోమోటివ్, ఈవీ రంగాల్లో తెలంగాణలో కంపెనీలు పెట్టుబడులు పెట్టనున్నాయి.
వినోద రంగంలో అగ్రగామి సంస్థ ఐన వార్నర్ బ్రదర్స్- డిస్కవరీ, హెల్త్ కేర్ టెక్నాలజీలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెడ్ ట్రానిక్, ప్రపంచంలోనే అతిపెద్ద పెట్టుబడుల సంస్థ స్టేట్ స్ట్రీట్, బైన్ క్యాపిటల్ కు చెందిన వీఎక్స్ ఐ గ్లోబల్ సొల్యూషన్స్ తో పాటు లండన్ స్టాక్ ఎక్సేంజ్ గ్రూప్ కంపెనీలు తెలంగాణ ప్రగతి ప్రస్థానంలో భాగం అయ్యేందుకు ముందుకొచ్చాయి. వివిధ రంగాల్లో రాబోయే ఈ పెట్టుబడులతో రానున్న కాలంలో తెలంగాణలో సుమారు 42 వేల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. 30కి పైగా కంపెనీల సీఈఓలతో కేటీఆర్ సమావేశమై టైర్-2 నగరాల్లో ఐటీ కంపెనీలు తమ కార్యకలాపాలను ప్రారంభించేందుకు అంగీకారం తెలిపాయి.