దామగుండం అటవీ పరిరక్షణ ఉద్యమానికి కేటీఆర్ మద్దతు
దామగుండం రిజర్వ్ ఫారెస్ట్‌లో రాడార్ కేంద్రం వ్యతిరేక ఉద్యమానికి బీఆర్ఎస్ మద్దతుగా నిలుస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు.
దిశ, వెబ్ డెస్క్ :దామగుండం రిజర్వ్ ఫారెస్ట్‌లో రాడార్ కేంద్రం వ్యతిరేక ఉద్యమానికి బీఆర్ఎస్ మద్దతుగా నిలుస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలోని దామగుండం రిజర్వ్ ఫారెస్ట్‌లో రాడార్ కేంద్రం ఏర్పాటుకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న దామగుండం అటవీ పరిరక్షణ సమితి జేఏసీ రూపొందించిన సేవ్ దామగుండం సీడీని కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దామగుండం అటవీ పరిరక్షణ సమితి జేఏసీ ఆందోళనలను అర్ధం చేసుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాడార్ కేంద్ర ఏర్పాటు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్నారు.
కాగా అనంతగిరి కొండలలోని అటవీ భూములను వెరీ లో ఫ్రీక్వెన్సీ (విఎల్ఎఫ్) రాడార్ స్టేషన్ కోసం భారత నౌకాదళానికి కేటాయించడాన్ని నిరసిస్తూ ప్రజలు, పర్యావరణ కార్యకర్తలు 'సేవ్ దామగుండం ఫారెస్ట్' అంటూ నిరసనలు కొనసాగిస్తున్నారు. దాదాపు రూ. 2,500 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న రాడార్ ప్రాజెక్ట్.. విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళ కమాండ్ ప్రతిపాదించిన విఎల్ఎఫ్ రాడార్ స్టేషన్‌ను ఏర్పాటు చేయనున్నారు. తక్కువ ఫ్రీక్వెన్సీ రేడియో తరంగాలను ఉపయోగించి నౌకలు, జలాంతర్గాములతో కమ్యూనికేట్ చేయవచ్చు.. వికారాబాద్ జిల్లా, పూడూరు మండలంలోని దామగుండం అడవులు జీవవైవిధ్యంతో ఉంటాయి. ఔషధ మొక్కలు, విలువైన వృక్షాలు, జంతుజాలంతో సహా వందలాది అరుదైన వృక్ష జాతులు ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా 2,900 ఎకరాల అటవీ భూమిని ధ్వంసం చేయనున్నారు. సుమారు 12 లక్షల చెట్లను నరికివేయవలసి ఉంటుందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రాడార్ స్టేషన్ ప్రాంతంలో 500 ఏళ్లుగా కొలువైన శ్రీరామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నష్టం జరుగుతుందని, 32.10 ఎకరాల్లో ఉన్న ఆలయం, అక్కడ ఉన్న కొలను మనుగడ ప్రమాదంలో పడుతుందన్న వాదనలున్నాయి. ఈ ప్రాంతంలో యాంటెన్నా పార్క్ కోసం 1,400 ఎకరాలు, సాంకేతిక ప్రాంతాల కోసం 1,090 ఎకరాలు, అధికారిక, నివాస సముదాయాల కోసం 310 ఎకరాలు, రేడియేషన్ ప్రమాదాల కోసం 'సేఫ్ జోన్'గా 100 ఎకరాలు వినియోగించనున్నారు. రాడార్ కేంద్రం ఏర్పాటుతో 20 గ్రామాల్లోని దాదాపు 60,000 మంది ప్రజల జీవితాలు ప్రభావితమవ్వనున్నాయి. అడవిపై ఆధారపడిన చిన్న రైతులు, పశువులను మేపుకుంటూ జీవిస్తున్న కుటుంబాల జీవనోపాధిపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అటవీ విధ్వంసం మూసీ, కాగ్నా వంటి స్థానిక నదులపై కూడా ప్రభావం చూపనుంది.ప్రాజెక్ట్ కారణంగా దీర్ఘకాలిక పర్యావరణ సమస్యలు, రాష్ట్రానికి, ప్రజలకు గణనీయమైన నష్టాన్ని కలిగిస్తాయని ప్రజలు, పర్యావరణ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.