తప్పకుండా ఉప ఎన్నిక వస్తుంది.. కేటీఆర్ షాకింగ్ కామెంట్స్
శేరిలింగంపల్లి నియోజకవర్గా(serilingampally constituency)నికి తప్పకుండా ఉప ఎన్నిక వస్తుందని బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: శేరిలింగంపల్లి నియోజకవర్గా(serilingampally constituency)నికి తప్పకుండా ఉప ఎన్నిక వస్తుందని బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో శేరిలింగంపల్లి నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. అధికారంలో లేకున్నా ఇంతమంది కార్యకర్తలు తెలంగాణ భవన్‌కు వచ్చారని అన్నారు. శేరిలింగంపల్లిలో తప్పకుండా ఉప ఎన్నిక(By-election) వస్తుందని జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ ఏం తక్కువ చేసిందని గాంధీ పార్టీ మారాడని ప్రశ్నించారు. మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) అతి తెలివి ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొట్టుకున్నారని మాట్లాడుతున్నారు. ఆ ఎమ్మెల్యేలకు కండువా కప్పింది ఎవరు? అని ప్రశ్నించారు. పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేల బతుకు బస్టాండ్ కాబోతోందని షాకింగ్ కామెంట్స్ చేశారు.
‘రేవంత్ చేస్తున్న దిక్కుమాలిన రాజకీయం అందరూ చూస్తున్నారు. ఎక్కువ కాలం ఇది నడవదు. రైతు భరోసా లేదు.. ముఖ్యమంత్రి కుర్చీకే భరోసా లేదు. రాహుల్ గాంధీ అశోక్ నగర్ వచ్చి డ్రామాలు ఆడారు. కానీ ఉద్యోగాలు మాత్రం ఇవ్వలేదు. కేసీఆర్‌ను బూతులు తిట్టుడు తప్ప రేవంత్ చేసింది ఏమీ లేదు. గరీబోల్ల మీద ముఖ్యమంత్రి పగ బట్టాడు. రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డికి ఒక న్యాయం.. పేదలకు ఒక న్యాయమా?’ అని కేటీఆర్ అడిగారు. రియల్ ఎస్టేట్ దందా తప్ప వాళ్లు చేసింది ఏంటని మండిపడ్డారు. దమ్ముంటే నిర్మాణాలకు పర్మిషన్‌లు ఇచ్చిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని సూచించారు. ముందు పట్నం మహేందర్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిర్మాణాలు కూల్చాలని డిమాండ్ చేశారు.
మానవత్వం ఉన్న ప్రభుత్వమే అయితే ముందు నోటీసులు ఇవ్వాలని అన్నారు. ‘అసలు హైడ్రాకు చట్టం లేదు. హైడ్రా బాధితులకు అండగా ఉండేందుకు కార్యాచరణ తీసుకుంటాం. తెలంగాణ ఉన్నంత కాలం కేసీఆర్‌ను ప్రజలు మర్చిపోరనే విషయం చిట్టి నాయుడు గుర్తుంచు కోవాలి. అయ్యప్ప సొసైటీలో తిరుపతి రెడ్డి ట్యాక్స్ నడుస్తోంది. ముఖ్యమంత్రి ఆయన సోదరులు, బంధువులు హైదరాబాద్ మీద పడి స్వైర విహారం చేస్తున్నారు. అన్ని విషయాలు త్వరలోనే బయటకు వస్తాయి. శేరిలింగంపల్లిలో ఏ ఇబ్బంది ఉన్నా మేము అండగా ఉంటాం. రాష్ట్రం మొత్తం కేసీఆర్ రావాలనే కోరుకుంటున్నారు. ఆ రోజు త్వరలోనే వస్తుంది’ అని కేటీఆర్ అన్నారు.