సీఎం రేవంత్ రెడ్డి చేతులెత్తేశారు.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలతో ముఖ్యంగా ప్రభుత్వం ఘనంగా చెప్పుకుంటున్న రైతు రుణమాఫీ మోసం వలన లక్షలాదిమంది రైతులు తీవ్రమైన ఆవేదనలో ఉన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు.

Update: 2024-08-18 11:27 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలతో ముఖ్యంగా ప్రభుత్వం ఘనంగా చెప్పుకుంటున్న రైతు రుణమాఫీ మోసం వలన లక్షలాదిమంది రైతులు తీవ్రమైన ఆవేదనలో ఉన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. అబద్ధాలు, అభూతకల్పనలతో అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణ రైతులను నిలువునా మోసం చేస్తున్నారు. అధికారంలోకి రాగానే డిసెంబర్ 9న ఏకకాలంలో రెండులక్షల రుణమాఫీ చేస్తామని ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టిన సీఎం రేవంత్.. మూడు విడతలుగా మోసం చేస్తూ.. ఎనిమిది నెలలుగా ఊరించి ఊరించి చివరికి రైతులను ఉసూరుమనిపించారు.

కనీసం 40 శాతం కూడా రుణమాఫీ పూర్తిచేయకుండానే వందశాతం రుణమాఫీ పూర్తయిపోయిందని ప్రకటించడం వందకు వందశాతం అబద్ధమని మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కారు అసమర్థతకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. అసలు లక్ష రూపాయల రుణమాఫీ కన్నా.. రెండు లక్షల రుణమాఫీ లబ్ధిదారుల సంఖ్య 14 లక్షలు తగ్గడం రైతు రుణమాఫీ ఏ మేరకు విఫలమైందో అద్దం పడుతుంది. రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ లెక్క ప్రకారం రెండు లక్షల రుణమాఫీకి 49,500 కోట్లు అంచనా వేశారు. ముఖ్యమంత్రే స్వయంగా రుణమాఫీకి 40వేల కోట్ల వరకు అవుతుందని తొలుత చెప్పుకొచ్చారు.

కడుపు కట్టుకుంటే.. ఇది పెద్ద విషయం కాదని ఇంటర్వ్యూల్లో గొప్పలు చెప్పారు. చివరికి రాష్ట్ర కేబినెట్ సమావేశం వరకు వచ్చే సరికి 31 వేలకు దీన్ని కుదించారు. కనీసం అంతమేరకైనా చేశారా? అంటే అదీ లేదు. రాష్ట్ర బడ్జెట్‌లో మరింత కోత పెట్టి 26 వేల కోట్లు మాత్రమే కేటాయించారు. తీరా మూడు విడతల రుణమాఫీ తతంగాన్ని రూ.17,933 కోట్లతో మమ అనిపించారు. 49,500 కోట్ల రూపాయల రెండు లక్షల రుణమాఫీ కాస్తా.. మూడు విడతల్లో దాదాపు మూడింతలు తగ్గి 17,933 చేరింది. 40 శాతం కూడా రుణమాఫీ చేయకుండా.. లక్షలాది మంది రైతులను నట్టేట ముంచి ప్రక్రియ పూర్తయిందని సీఎం రేవంత్ రెడ్డి చేతులెత్తేయడంతో.. యావత్ తెలంగాణ ఇవాళ రైతుల ఆందోళనలతో అట్టుడుకుతోందని కేటీఆర్ అన్నారు.

Tags:    

Similar News