Sridhar Babu: కేటీఆర్ నాన్సెన్స్ మాట్లాడకు.. పదేళ్లు హైప్ తప్ప చేసిందేమి లేదు: శీధర్ బాబు
మంత్రి శ్రీధర్ బాబు ఘాటు విమర్శలు చేశారు.
దిశ, డైనమిక్ బ్యూరో: గడిచిన పదేళ్లలో బీఆర్ఎస్ పాలకులు ఐటీ చుట్టూ టూమచ్ హైప్ క్రియేట్ చేశారే తప్ప ఆ మేరకు పని మాత్రం చేయలేకపోయారని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు విమర్శించారు. తాజాగా ఓ ఇంగ్లీష్ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన హాట్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం బెంగళూరు, హైదరాబాద్ కు మధ్య చాలా భారీ భారీ అంతరం ఉందని సాప్ట్ వేర్ ఎగుమతుల్లో బెంగళూరును బీట్ చేయాల్సి ఉందన్నారు. హైదరాబాద్ ప్రస్తుతం ఏఐ సంస్థలను ఆహ్వానిస్తున్నదని హైదరాబాద్ ను ఏఐ రాజధానిగా మార్చడమే లక్ష్యంగా దృష్టి సారించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ లో మొదటి ఎంఎస్ఎంసీ పాలసీని ఆవిష్కరించబోతున్నదని ఇందుకు సంబంధించిన డ్రాప్ట్ దాదాపుగా సిద్ధమైందన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి, మంత్రి వర్గం ఈ డ్రాప్ట్ ను పరిశీలిస్తున్నదని చెప్పారు. కొత్త గ్రీన్ ఎనర్జీ పాలసీ, ఇండస్ట్రియల్ పాలసీ, ఇండస్ట్రీయల్ పాలసీలపై కసరత్తు జరుగుతున్నదని వెల్లడించారు. పరిశ్రమకు ఏమి కావాలి మన విద్యా వ్యవస్థ ఉత్పత్తి చేసే వాటి మధ్య అంతరాన్ని తగ్గించడానికి స్కిల్ యూనివర్సిటీ ద్వారా ఉపయోగపడుతుందన్నారు. హైదరాబాద్ నగరం టాలెంట్ ను ప్రోత్సహిస్తుందని ఇదే సమయంలో ఇతర రాష్ట్రాల వారితో పోటీ పడేలా తెలంగాణ యువతకు స్కిల్ యూనివర్సిటీ ద్వారా నైపుణ్యాభివృద్ధికి కృషి చేస్తామన్నారు.
కేటీఆర్ ఆరోపణలు నాన్ సెన్స్:
మేము ఆరు గ్యారెంటీలతో పాటు 13 వాగ్దానాలు చేశాం. ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం. మా హామీల విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తేలేదు. గత పదేళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ పాటించలేదు. దాని వల్లే గ్యారెంటీల అమలు విషయంలో కొంత జాప్యం జరుగుతున్నది. ఇచ్చిన మాట ప్రకారం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, ఆరోగ్యశ్రీ కవరేజీ రూ. 10 లక్షలకు పెంపు, రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేశామన్నారు. గత ప్రభుత్వం మాదిరిగా రూ.1 లక్ష పంట రుణాన్ని నాలుగు దశల్లో చేసిందని విమర్శించారు. ఈ ప్రభుత్వ చొరవ, కమిట్మెంట్ ను ప్రజలు గమనిస్తున్నారన్నారు. వాల్మికి స్కామ్ విషయంలో కేటీఆర్ చేస్తున్న ఆరోపణలు నాన్ సెన్స్ అన్నారు.
బీఆర్ఎస్, బీజేపీలోనూ నాకు ఫ్రెండ్స్:
తన రాజకీయ జీవితంలో వ్యక్తిగత దూషణలకు వెళ్లనని శ్రీధర్ బాబు చెప్పారు. తాను కొన్ని సూత్రాలను పాటిస్తానని వాటిని ఎప్పుడు నా ఆలోచనలో ఉంచుకుంటానన్నారు. క్షేత్ర స్థాయిలో తనను చాలా మంది వ్యక్తిగతంగా విమర్శించేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ నేను మాత్రం అంశాలపైనే మాట్లాడుతుంటానన్నారు. తనకు బీఆర్ఎస్ తో పాటు, బీజేపీలోను స్నేహితులు ఉన్నారని చెప్పారు. సిద్ధాంత పరంగా వారితో విభేదాలు ఉన్నా వ్యక్తిగతంగా మాత్రం చాలా మంది స్నేహితులు ఉన్నారన్నారు. ఇటీవల కాలంలో వ్యక్తిగత విమర్శలపై మీడియా ముఖ్యంగా సోషల్ మీడియాలో ఫోకస్ పెడుతున్నదన్నారు. అటువంటి వాటిలో తాను ఇన్వాల్వ్ కానన్నారు.