కవిత ఇష్యూపై తొలిసారి స్పందించిన కేటీఆర్.. నోటీసులపై మంత్రి ఏమన్నారంటే?

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇచ్చిన తర్వాత తొలిసారి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పందించారు.

Update: 2023-03-09 16:39 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇచ్చిన తర్వాత తొలిసారి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పందించారు. క‌విత‌కు ఇచ్చింది ఈడీ స‌మ‌న్లు కాదు..మోదీ స‌మ‌న్లుఅని మండిపడ్డారు. ఉద్యమనేత బిడ్డగా.. పుట్టుకనుండే చైతన్యాన్ని పుణికి పుచ్చుకున్న ఉద్యమకారురాలు ఎమ్మెల్సీ కవిత విషయంలో ఈడీ పేరుతో వేధింపులు కేసీఆర్ గారిని టార్గెట్ చేయడానికి కాదా ? అని ప్రశ్నించారు. తెలంగాణ భ‌వ‌న్‌లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

మోడీ, కేంద్ర ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తున్నందుకే కేంద్రం దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తుందనిమండిపడ్డారు. మోడీ సర్కార్ చేతిలో ఈడీ కీలుబొమ్మ.. సీబీఐ తోలుబొమ్మ అని ధ్వజమెత్తారు. దాదాపు 12 మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులపై ఈడీ, సీబీఐ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలతో దాడులు చేయించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే క్రమంలో నిన్న ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసు పంపించిందని ఆరోపించారు.ఎంక్వయిరీలకు బీఆర్ఎస్ నేతలు భయపడరని స్పష్టం చేశారు. మోడీ ప్రభుత్వానికి తెలిసింది ఒకటే.. అయితే జూమ్లా లేదంటే హమ్లా అని ధ్వజమెత్తారు.

నీతిలేని పాలనకు.. నిజాయితీ లేని దర్యాప్తు సంస్థలకు పర్యాయపదంగా మారింది కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అని దుయ్యబట్టారు. ప్రతిపక్షాల మీద కేసుల దాడి, ప్రజల మీద ధరల దాడి.. ఇది తప్ప ఈ తొమ్మిదేళ్లలో మోడీ సర్కార్ సాధించింది ఏమీ లేదని ఆరోపించారు. గౌతమ్ అదాని మోడీకి బినామీ అని దేశ ప్రజలకు తెలియంది కాదని, వీరిద్దరి బంధంపై లైవ్ డిటెక్టర్ టెస్టుకు సిద్ధమా అని సవాల్ చేశారు.

ఒక మాఫియాను న‌డిపించిన‌ట్టే మీడియాను న‌డిపిస్తున్నారని మండిపడ్డారు. జ‌ర్నలిస్టులు, మీడియా సంస్థలంటే మాకు గౌర‌వం ఉందని, కానీ మీడియా యాజ‌మాన్యాల గొంతు నులిమి ప‌ట్టుకుని ఈడీ, సీబీఐ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. అధికారం కోసం కేంద్రం ఎంతకైనా దిగరాజుతుందని ఆరోపించారు. వీ6లో ఏం మాట్లాడుతారో తెలుసు.. ఏం చూపెడుతారో తెలుసు.. ఏం డ్రామాలో చేస్తారో తెలుసు.. మిమ్మల్ని ఎప్పుడు బ్యాన్ చేయాలో కూడా మాకు తెలుసు అని హెచ్చరించారు.

వంద శాతం చెబుతున్నానని బీజేపీ మౌత్ పీసెస్‌ లాగా ఉన్న చిల్లర సంస్థలు రాష్ట్రంలో ఏవైతో ఉన్నాయో.. వాటిని ప్రజ‌ల ముందు ఎండ‌గ‌డుతామని స్పష్టం చేశారు. న‌మ‌స్తే తెలంగాణ‌, తెలంగాణ టుడే అనే దిన‌ప‌త్రిక‌ల‌ను బీజేపీ ఆఫీసులో బ్యాన్ చేశారని, దాని గురించి ఎందుకు మాట్లాడ‌టం లేదని, అది అప్రజాస్వామికం కాదా..? ప‌త్రిక‌లు ఈ దేశంలో ఎవ‌రు ఆడించిన‌ట్టు ఆడుతున్నాయని నిల‌దీశారు.

ప్రజాక్షేత్రంలో బీజేపీ అంతుచూస్తామని హెచ్చరించారు. బజారుకీడుస్తాం... బట్టలు విప్పుతాం.. బీజేపీని నగ్నంగా నిలబెడుతామని స్పష్టం చేశారు. మాకు విచారణను ఎదుర్కొనే దమ్ముందని మోడీకి ఉందా అని సవాల్ చేశారు. బీఎల్ సంతోష్ డబుల్ బాజీదొంగ అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మోడీ ఉడుత ఊపులకు భయపడబోమని వెల్లడించారు. మోడీని రాజకీయంగానే ఎదుర్కొంటామని, ప్రజాకోర్టులో న్యాయమే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

13 లక్షల కోట్ల ఎల్ఐసీ, ఎస్బీఐ వంటి ప్రజలకు చెందిన సంస్థల డబ్బులు ఆవిరైనా.. దేశ ప్రధానమంత్రి ఉలకడు పలకడు అని, దేశ ఆర్థిక మంత్రికి కనీసం చీమకుట్టినట్టు కూడా కాదని దుయ్యబట్టారు. ఒక సంస్థకు రెండు ఎయిర్ పోర్టులకంటే ఎక్కువ కాంట్రాక్టు కట్టబెట్టొద్దు అని ఇప్పటిదాకా ఉన్న నిబంధనలను తుంగలో తొక్కి.. గౌతమ్ అదానికి 6 ఎయిర్పోర్ట్లు కట్టబెట్టడం ఎంతవరకు సమంజసం ? అని ప్రశ్నించారు. గౌతం అదానీ ఆధీనంలోని గుజరాత్ లోని ముంద్రా పోర్టులో 3000 కిలోల అంటే దాదాపు 21 వేల కోట్ల విలువైన హెరాయిన్ పట్టుబడితే ఒక్క కేసు నమోదు కాలేదని, దానిని ప్రశ్నించే దమ్ము కేంద్ర ప్రభుత్వానికి ఉందా అన్నారు.

బీబీసీ వంటి అంతర్జాతీయ మీడియా సంస్థల మీద దాడులు చేయడం ద్వారా తమకు అనుకూలంగా లేకపోతే మీడియా సంస్థల మీద ఎలాంటి చర్యల కైనా సిద్ధం అని మోడీ వార్నింగ్ ఇచ్చాడన్నారు. మోడీ పాలనలో ఈడీ దాడులు 95 శాతం విపక్షాల మీదనే జరుగుతున్నాయని, ఈ తొమ్మిదేళ్లలో ప్రతిపక్షాలపై పెట్టిన 5422 కేసుల్లో కేవలం 23 కేసుల్లో మాత్రమే తీర్పు వచ్చిందన్నారు. నిన్నగాక మొన్న కర్ణాటకలో బీజేపీ ఎమ్మెల్యే విరూపాక్ష కొడుకు 40 లక్షల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడని, దానిమీద ఎలాంటి దాడులు ఉండవు అన్నారు. ఈ లెక్కన అసలు దేశంలో ఏం జరుగుతుందన్నారు. 9రాష్ట్రాల్లో దొడ్డిదారిన మోడీ సర్కార్ రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చింది నిజం కాదా ? పెద్ద ఎత్తున పార్టీలను చీల్చిన విషయం నిజం కాదా ? అన్నారు.

డబుల్ ఇంజన్ అంటున్న కేంద్రం.. ఒక ఇంజిన్ మోడీ అయితే మరో ఇంజన్ ఆదాని అని దుయ్యబట్టారు. మునుగోడు ఉప ఎన్నికల్లో 18 వేల కోట్లు కాంట్రాక్టు కట్టబెట్టి కాంగ్రెస్ అభ్యర్థిని బీజేపీపార్టీలోకి లాక్కున్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. నమ్ముకున్న ప్రజల కోసం బీజేపీ వైఫల్యాలను ఎండగట్టిన పాపానికి ప్రాంతీయ పార్టీల నేతల మీద కేసుల పేరుతో వేధిస్తున్నది నిజం కాదా ? అని ప్రశ్నించారు. దేశంలో సీబీఐ, ఈడీ లాంటి విచారణ సంస్థలు ఒక్క ప్రతిపక్ష నేతలనే ఎందుకు టార్గెట్ చేస్తున్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు. మోడీ - అదానీ చీకటి స్నేహం వెనుక దాగి ఉన్న ఆంతర్యం ప్రజలకు తెలియదు అని మీరు గుండె మీద చెయ్యేసుకొని చెప్పగలరా ?.. కర్ణాటకలో 40 శాతం కమీషన్ పేరుతో మంత్రులు, ఎమ్మెల్యేలు చేస్తున్న అవినీతికి విసిగిపోయి కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకుంటున్నది నిజం కదా ? ఇంకా ఎంతకాలం ప్రజలను మోసం చేస్తారు అని మోడీ సర్కారును ప్రశ్నించారు.

Tags:    

Similar News