యాదాద్రి ఇన్సిడెంట్‌పై స్పందించిన కేటీఆర్.. మంత్రి కోమటిరెడ్డిపై సీరియస్
యాదాద్రి-భువనగిరి జెడ్పీ సమావేశంలో జరిగిన ఘర్షణపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.
దిశ, వెబ్‌డెస్క్: యాదాద్రి-భువనగిరి జెడ్పీ సమావేశంలో జరిగిన ఘర్షణపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. సోమవారం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. యాదాద్రి జిల్లా జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సందీప్ రెడ్డిని కోమటిరెడ్డి దుర్భాషలాడారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మంత్రుల అహంకార వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ప్రశ్నించిన ప్రజలు, ప్రజాప్రతినిధులపై కోమటిరెడ్డి వరుసగా నోరు పారేసుకుంటున్నారని గుర్తుచేశారు. ఇటీవల రైతుబంధు డబ్బులు పడలేదు అంటే చెప్పుతో కొట్టాలని మాట్లాడిన మాటలను కేటీఆర్ గుర్తుచేశారు.
ఇవాళ మరోసారి ప్రజాప్రతినిధిని అధికారిక కార్యక్రమంలో దుర్భాషలాడి కోమటిరెడ్డి అహాంకార వైఖరిని ప్రదర్శించారని తెలిపారు. ప్రజా ప్రతినిధులని కూడా గౌరవించకుండా కాంగ్రెస్ మంత్రులు నియంతృత్వంగా ప్రవర్తిస్తున్నారని అన్నారు. ఇలాంటి దాడులకు బీఆర్ఎస్ నేతలు భయపడబోరని అన్నారు. కాంగ్రెస్ పాలన ఏ విధంగా ఉందో ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. కేసీఆర్‌ను ఓడించి పెద్ద తప్పు చేశామనే భావన ప్రజల్లో వస్తోందని వెల్లడించారు. ప్రజలు తమ అసహనాన్ని పార్లమెంట్ ఎన్నికల్లో చూపిస్తారని.. కాంగ్రెస్‌కు బుద్ధిచెబుతారని అన్నారు.