అమిత్ షా వ్యాఖ్యలు ఆయన స్థాయికి తగినవి కాదు: మంత్రి కేటీఆర్ సెటైర్లు
హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని నిర్వహించేందుకు సీఎం కేసీఆర్‌కు మనసు రావడం లేదని.. సెప్టెంబర్ 17పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ రియాక్ట్ అయ్యారు.
దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని నిర్వహించేందుకు సీఎం కేసీఆర్‌కు మనసు రావడం లేదని.. సెప్టెంబర్ 17పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. ఈ అంశంలో కేంద్ర హోంమంత్రివి స్థాయికి తగిన వ్యాఖ్యలు కావని సెటైర్ వేశారు. హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనం నేపథ్యంలో సెప్టెంబర్ 17ను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా జాతీయ సమైక్యత దినోత్సవంగా జరుపుతోందని అన్నారు. దీనికి సంబంధించిన పలు పత్రికల్లో వచ్చిన కథనాలు ఇవిగో అంటూ సోమవారం ట్విట్టర్ పేపర్ క్లిప్పింగ్‌లు షేర్ చేశారు.
తెలంగాణ ప్రభుత్వంపై అమిత్ షా అబాండాలు వేయడం సరికాదని అన్నారు. ఈ రోజును విమోచన దినోత్సవంగా ఎందుకు జరపడం లేదని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. అలాంటి వారు ఆగస్టు 15ను స్వాతంత్య్ర దినోత్సవానికి బదులు విమోచన దినోత్సవంగా ఎందుకు జరుపుకోవడం లేదని ప్రశ్నించారు. అణచివేతదాడులకు వ్యతిరేకంగా జరిగిన త్యాగాలు, పోరాటలను గౌరవప్రదంగా స్మరించుకోవడం ముఖ్యం అన్నారు. గతకాలపు ఖైదీలుగా ఉండటం మాని భవిష్యత్ నిర్మాణాకర్తలుగా మారాలని పిలుపునిచ్చారు. కాగా నిన్న బీదర్‌లో జరిగిన సభలో అమిత్ షా మాట్లాడుతూ నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన వారిని కాంగ్రెస్, బీఆర్ఎస్ విస్మరించిందని ధ్వజమెత్తారు.