'తప్పంతా మాదే.. మేమే మారాలి' ఓటమిపై కేటీఆర్, హరీశ్ రావు హాట్ కామెంట్స్
పార్టీ ఓటమిపై కేటీఆర్, హరీశ్ రావు హాట్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ ను తిరిగి టీఆర్ఎస్ గా మార్చడం పూర్తిగా కేసీఆర్ ఇష్టం అని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గత ఎన్నికల్లో మా పార్టీ ఓటమికి ప్రజలతో మాకు ఏర్పడిన గ్యాప్ కారణం అన్నారు. మా వైఖరి మార్చుకోవాల్సిన అవసరం ఉందని మా ఓటమికి ప్రజలను తప్పు బట్టం లేదని తప్పు మేమే తప్పు చేశామని హాట్ కామెంట్స్ చేశారు. మంగళవారం ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన కేటీఆర్.. పార్టీలో తెలంగాణ పేరు మార్చడం వల్ల ఓడిపోయాం అనడానికి ఆధారం లేదన్నారు. హైదరాబాద్ లో అన్ని సీట్లు గెలిచామని, చేసిన అభివృద్ధిని మేము చెప్పుకోలేకపోయామన్నారు. మాకు అహంకారం ఉందని కృత్రిమ ప్రచారం సృష్టించారని ఆత్మవిశ్వాసం, అహంకారానికి తేడా తెలియదన్నారు. అభివృద్ధిలో మాతో పోటీ పడలేనివారే అహంకారం అని ప్రచారం చేశారన్నారు. పేదలకు పెద్ద ఎత్తున పథకాలు ఇచ్చినా ఏపీలో జగన్ ఓడిపోవడం ఆశ్చర్యం కలిగించిందని, అయినా 40 శాతం ఓట్లు సాధించడం మామూలు విషయం కాదన్నారు. పవన్ విడిగా పోటీ చేసి ఉంటే ఫలితాలు మరో విధంగా ఉండేవన్నారు. ప్రతిరోజూ జనంలోకి వెళ్లే కేతిరెడ్డి ఓడిపోయారని సంచులతో దొరికినవాడు సీఎం అయ్యారని సెటైర్ వేశారు. జగన్ ను ఓడించేందుకు షర్మిల ను ఒక వస్తువులా ఉపయోగించారని అంతకు మించి షర్మిల ఎఫెక్ట్ ఏమీ లేదన్నారు.
ఎమ్మెల్యేలను చేర్చుకుని నష్టపోయాం:
గతంలో ఫిరాయింపుల వల్ల మాకు లాభం ఏమి జరగలేదని, ఎమ్మెల్యేలను చేర్చుకుని నష్టపోయామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఈ సందర్భంగా చెప్పారు. మా పార్టీలు చేరిన వాళ్ళల్లో పది మంది ఓడిపోయారని చెప్పారు. పార్టీ ఫిరాయించిన వారి విషయంలో సుప్రీం తీర్పు ప్రకారం మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలన్నారు. తెలంగాణలో మళ్ళీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీనే అని ప్రజలు ప్రస్తుతం ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి వ్యత్యాసం చూస్తున్నారన్నారు. రేవంత్ రెడ్డికి పాలనపై పట్టు రాలేదని విమర్శించారు. ఆయన పాలన వదిలేసి రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అధికారులు మా చేతుల్లో ఉన్నారంటే అది వారి చేతగాని తనం అన్నట్టే కదా అని ప్రశ్నించారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం పడకేసిందని ప్రజలు డెంగ్యూ, మలేరియా బారిన పడుతున్నారన్నారు.