KTR: కోర్టు తీర్పుతో ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో వణుకు మొదలైంది: కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు

కోర్టు తీర్పుతో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల్లో వణుకు మొదలైందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు.

Update: 2024-09-14 06:26 GMT

దిశ, వెబ్‌డెస్క్: కోర్టు తీర్పుతో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల్లో వణుకు మొదలైందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. శనివారం ఆయన ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి పరామర్శించేందుకు కొండాపూర్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రుణ మాఫీ, మహిళలకు నగదు అంటూ కాంగ్రెస్ ఊదరగొట్టిందని కామెంట్ చేశారు. ఇవాళ రాష్ట్రంలో ప్రతీ వర్గాన్ని మోసం చేస్తున్నారని మండిపడ్డారు. 9 నెలలుగా రాష్ట్రంలో కేవలం హెడ్‌లైన్ మేనేజ్‌మెంట్ జరుగుతోందని ఆరోపించారు. వంద రోజుల్లో ప్రజల జీవితాలను మార్చేస్తామని అన్నారని తెలిపారు. రేవంత్, ఆయన తొత్తులు దారుణంగా ప్రవర్తిస్తున్నారని ఫైర్ అయ్యారు. పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చుట్టూ తిరిగి ఆయనే కండువా కప్పాడని గుర్తు చేశారు.

ఒకానొక సందర్భంలో తాము గేట్లు ఎత్తితే.. అంటూ సీఎం ఉపన్యాసాలు దంచేశారని ఎద్దేవా చేశారు. తాజాగా, హైకోర్టు తీర్పుతో ఫిరాయింపు ఎమ్మెల్యేల పదవి పోతోందని తెలిపారు. అందుకే వారిలో వణుకు మొదలైందని అన్నారు. ఎమ్మెల్యేల అనర్హత విషయంలో స్పీకర్ త్వరగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కోర్టు తీర్పు ఉందని గుర్తు చేశారు. ఆనాడు రేవంత్ ప్రతిపక్షంలో ఉన్ననాడు పార్టీ మారిన వారిని రాళ్లతో కొట్టి చంపాలని, ఉరి తీయాలని మాట్లాడారని ఎద్దేవా చేశారు. మరీ దారుణంగా తీర్పు వచ్చిన నాడే అరెకపూడి గాంధీకి పీఏసీ పదవి కట్టబెట్టడం హైకోర్టు, సుప్రీం కోర్టు తీర్పులను బేఖాతరు చేయడమేనని అన్నారు. తాను పార్టీ మారలేదని, బీఆర్ఎస్‌లోనే ఉన్నానని చెప్పిన గాంధీని ప్రశ్నిస్తే.. తమ ఎమ్మెల్యేలపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. కౌశిక్‌రెడ్డి ఇంటిపై 50 మంది గూండాలతో దాడి చేశారని పేర్కొన్నారు. ఒకవేళ ఇంట్లో వారికి ఏమైనా అయితే బాధ్యులు ఎవరని ప్రశ్నించారు.


Similar News