అసెంబ్లీ సాక్షిగా డిప్యూటీ సీఎం అబద్ధం చెప్పారు: కేటీఆర్

ప్రియాంక గాంధీ నిరుద్యోగ భృతి ఇస్తామని చెబితే, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అది తమ మేనిఫెస్టోలో లేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు.

Update: 2024-01-19 07:42 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రియాంక గాంధీ నిరుద్యోగ భృతి ఇస్తామని చెబితే, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అది తమ మేనిఫెస్టోలో లేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ సాక్షిగా డిప్యూటీ సీఎం అబద్ధం చెప్పారని సీరియస్ అయ్యారు. శుక్రవారం మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని తెలంగాణ భవన్‌లో నిర్వహించారు. ఈ సమావేశంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడుతూ.. అసెంబ్లీలో కాంగ్రెస్ నేతలు చెప్పేవి అబద్ధాలు అని రుజువు చేసేందుకు స్వేదపత్రం విడుదల చేశామని గుర్తుచేశారు. ఆ స్వేదపత్రంలో సమగ్ర అభివృద్ధిని పొందుపరిచామని గణాంకాలు, ఆధారాలతో సహా వివరించామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఇచ్చింది ఆరు గ్యారంటీలు కాదు.. మొత్తం లెక్క తీస్తే 420 హామీలు ఇచ్చారని ఎద్దేవా చేశారు. దీనిని ఎండగట్టే బాధ్యత మనందరి మీద ఉందని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక డిసెంబర్ 9 నాడు రుణమాఫీ చేస్తా, 2 లక్షల రుణం తెచ్చుకోండి అని రేవంత్ మాట్లాడిన మాటలను కేటీఆర్ గుర్తుచేశారు.

నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూ ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని అన్నారు. ఒక పక్క అదానీని రాహుల్ గాంధీ విమర్శిస్తుంటే.. అదే రోజు అదానీతో రేవంత్ రెడ్డి భేటీ కావడం ఆశ్చర్యం కలిగిస్తోందని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీలు రెండు ఒక్కటే అని మరోసారి రుజువైందని అన్నారు. కేసీఆర్ అధికారంలో ఉన్నన్ని రోజులు అదానీని తెలంగాణ వైపు కన్నెత్తి చూడనివ్వలేదు.. కాంగ్రెస్ అధికారింలోకి వచ్చిన నెలరోజుల్లోనే అదానీ చేతుల్లోకి తెలంగాణ వెళ్లిందని కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్, హరీష్ రావు నాయకత్వంలో క్రియాశీలకంగా పని చేసి వచ్చే ఎంపీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ సాధించాలని పిలుపునిచ్చారు. ఈసారి కూడా మెదక్‌లో కాంగ్రెస్ జెండా ఎగరబోతోందని.. ఇందులో ఎలాంటి సందేహం లేదని అన్నారు.

Tags:    

Similar News