‘బిల్డర్లను బ్లాక్‌మెయిల్ చేయడానికే హైడ్రా’.. కేటీఆర్ సెన్సేషనల్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: హైడ్రా ద్వారా ప్రభుత్వం అనాలోచితంగా చేపడుతున్న కూల్చివేతల వల్ల నగర ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆక్రమణల కూల్చివేతల విషయంలో ప్రభుత్వానికి కనీస ప్రణాళిక, అవగాహన కూడా లేదని మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో ఈ రోజు (బుధవారం) మీడియాతో మాట్లాడిన ఆయన హైడ్రాపై, కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఆయన మాట్లాడుతూ.. మూసీ పరివాహక ప్రాంతంలో నివశిస్తున్న హైదరాబాద్ ప్రజలను అష్టకష్టాలకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 40, 50 ఏళ్ల కిందట ప్రభుత్వమే పట్టాలిచ్చి, ప్రభుత్వమే రిజిస్ట్రేషన్లు చేసి, పర్మిషన్లు ఇచ్చి, నల్లా బిల్లు, కరెంట్ బిల్లులు కట్టించుకుంటూ రోడ్లు, మోరీలు నిర్మించి ఇచ్చిన ప్రాంతంలో ఇప్పుడు అకస్మాత్తుగా అధికారులు వెళ్లి వాళ్ల ఇళ్లన్నీ అక్రమ నిర్మాణాలంటూ కూలగొడతుండడం అన్యాయం అన్నారు.
మూసీ సుందరీకరణ అయినా, మరే సమస్య అయినా.. పరిష్కారానికి ఓ పద్ధతి, ప్రణాళిక ఉండాలని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో అవేమీ లేవని విమర్శించారు. హైడ్రా అనేది బిల్డర్లను, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలను బ్లాక్‌మెయిల్ చేసి వసూళ్లు చేయడానికే వాడుతున్నట్లుగా కనిపిస్తోందని ఆరోపణలు చేశారు. మూసీ పేరుతో జరుగుతున్న లూటీని ప్రజల మధ్యకెళ్లి సవివరంగా అర్థమయ్యేలా చెప్తామని అన్నారు.
1981లో మూసీ పరివాహక ప్రాంతాల్లో కాలనీలు కట్టారు. వాళ్లందరికీ పట్టాలిచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే. రాజీవ్ గాంధీ పేరు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమే. 20 వేల కుటుంబాలు ఉండేలా అక్కడ రోడ్లు, ఎలక్ట్రిసిటీ, నల్లా కనెక్షన్లు ఇచ్చి పన్నులు కట్టించుకుంది వాళ్లే. బీఆర్ఎస్ అధికారంలోకి 2014లో వచ్చింది. అలాంటిది ఇప్పుడు వాళ్లందరి ఇళ్లను తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వమే కూల్చేస్తుంటే ఆ పేదల ఆవేదనకు ఎవరు బాధ్యులు..? మీరు చేసిన తప్పుకు పేదలను శిక్షించడం ఏం న్యాయం? ’’ అని కేటీఆర్ ప్రశ్నించారు. అయితే ఈ దురాగతాన్ని తమ పార్టీ చూస్తూ ఊరుకోదని, రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా పేద ప్రజలకు అండగా ఉంటామని మాటిచ్చారు. ఇక ఈ సమావేశంలో కేటీఆర్‌తోపాటు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.