KTR Arrest: ఏసీబీనా.. ఈడీనా! ముందుగా కేటీఆర్‌ను అరెస్టు చేసేది ఎవరు?

ఫార్ములా ఈ-కారు రేస్ ఇష్యూలో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Update: 2024-12-30 01:57 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఫార్ములా ఈ-కారు రేస్ ఇష్యూలో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఏసీబీ, ఈడీ రెండూ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయగా.. ఏ1 గా కేటీఆర్‌ను, ఏ2గా ఐఏఎస్ అరవింద్ కుమార్, ఏ3 గా బీఎల్ఎన్ రెడ్డిని చేర్చాయి. దర్యాప్తులోనూ రెండు సంస్థలూ పోటీపడుతున్నాయి. మరి కేటీఆర్‌ను ఎవరు అరెస్టు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. రాష్ట్రంలోని కేసును సహజంగా తొలుత ఏసీబీ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఆ తర్వాత ఈడీ దర్యాప్తు చేస్తుంది. కానీ ఈ కేసులో కొంత తేడా ఉన్నదన్న చర్చ పొలిటికల్ సర్కిల్‌లో జరుగుతున్నది. ముగ్గురు నిందితులకు హైకోర్టు ఆదేశాల కారణంగా ఏసీబీ ఇప్పటి వరకు నోటీసులు ఇవ్వలేదు. కానీ ఈడీ మాత్రం వచ్చేనెల 2, 3వ తేదీల్లో విచారణకు హాజరుకావాలని అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డికి, 7వ తేదీన హాజరుకావాలని కేటీఆర్‌కు నోటీసులు జారీ చేసింది.

ఈడీకి ఎందుకు తొందర?

ఈ నెల 31 వరకు కేటీఆర్‌ను అరెస్టు చేయొద్దని హైకోర్టు ఆదేశించడంతో ఏసీబీకి అడ్డంకులు ఎదురయ్యాయి. మరోవైపు ఈడీ మాత్రం దర్యాప్తును ముమ్మరం చేస్తున్నది. ఒక వేళ ఈడీ ముందుగానే కేటీఆర్​సహా ముగ్గురు నిందితులను అరెస్ట్​చేస్తే.. ఏసీబీ ఎలా ముందుకు వెళ్తుందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏసీబీ ఎఫ్ఐఆర్​ఫైల్​చేయగానే ఈడీ వెంటనే ఎంటరై కేసు నమోదు చేసింది. విచారణకు హాజరుకావాల్సిందిగా ముగ్గురికి నోటీసులు జారీచేసింది. కేటీఆర్ పేరు తెరపైకి రావడంతో ఈ కేసు రాజకీయ రంగు పులుముకున్నది.

ఈడీ దర్యాప్తు వెనకు బీజేపీ హస్తం?

ఫార్ములా ఈ-కారు రేస్ కేసులో ఈడీ దర్యాప్తు చేపట్టడంతో దీని వెనక బీజేపీ హస్తం ఉన్నదని పొలిటికల్ వర్గాల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈడీ, సీబీఐ, ఐటీ, లాంటివన్నీ బీజేపీ జేబు సంస్థలని ముందు నుంచే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు ఈడీ దూకుడు చూస్తుంటే తెరవెనక రాజకీయ కోణం ఉందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా బీజేపీ వ్యూహంలో బీఆర్ఎస్ ఇరుక్కున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసును అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్‌ను లొంగదీసుకోవడం లేదంటే పూర్తిగా అణచివేయడం వంటి వ్యూహాలను బీజేపీ అనుచరిస్తున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటనే ఆరోపణలు

బీజేపీ, బీఆర్‌ఎస్ ఒక్కటేనని ముందునుంచీ కాంగ్రెస్​ఆరోపిస్తున్నది. తాజాగా ఫార్ములా ఈ-కారు రేస్ కేసు విషయంలోనూ ఆ రెండు పార్టీల సంబంధాలపై మరోసారి చర్చ జరిగే అవకాశమున్నట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కేటీఆర్‌ను అరెస్ట్​చేస్తే ఒక రకంగా, అరెస్ట్​చేయకుంటే మరో రకంగా ప్రచారం చేసే అవకాశం ఉన్నదని అంచనా వేస్తున్నారు.

రేపటి తీర్పు ఆధారంగానే..

ఈ కేసులో ఏసీబీ వేగం పెంచాలంటే.. మంగళవారం హైకోర్టు ఇచ్చే తీర్పుపైనే ఆధారపడి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఆ తర్వాతే ఏసీబీ ముందుకు వెళ్లే అవకాశాలు ఉంటాయని అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News