ఆ రోజు తర్వాతే బీజేపీ తొలి జాబితా.. ఢిల్లీలో కిషన్ రెడ్డి మంతనాలు
ఎన్నికల పోలింగ్‌కు కొద్ది రోజులు మాత్రమే సమయం ఉన్న
దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల పోలింగ్‌కు కొద్ది రోజులు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో ప్రతిపక్ష, విపక్ష పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు షురూ చేస్తున్నాయి. వీలైనంత త్వరగా అభ్యర్థులను ఖరారు చేసి జాబితాను ప్రకటించేందుకు సిద్దమవుతున్నాయి. పార్టీలన్నీ కూడా అభ్యర్థుల ప్రకటనపై స్పీడ్ పెంచాయి. కాంగ్రెస్ నేడు ఢిల్లీలో కీలక భేటీలు నిర్వహిస్తోంది. స్క్రీనింగ్ కమిటీతో పాటు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమవ్వగా.. అభ్యర్థులను ప్రకటించేందుకు రంగం సిద్దం చేసుకుంటోంది.
ఈ క్రమంలో బీజేపీ కూడా అభ్యర్థుల జాబితా విడుదలపై ఫోకస్ పెట్టింది. ఈ మేరకు ఢిల్లీలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పార్టీ పెద్దలతో మంతనాలు జరుపుతున్నారు. తొలి జాబితా విడుదలపై అగ్రనేతలతో చర్చిస్తున్నారు. ఇప్పటికే 40 మంది అభ్యర్థులతో తొలి జాబితా సిద్దమవ్వగా.. దీనికి బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోదం తెలపాల్సి ఉంది. ఈ నెల 15,16వ తేదీల్లో రెండు రోజుల పాటు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. ఈ భేటీలో తెలంగాణ అభ్యర్థుల తొలి జాబితాను పరిశీలించి ఆమోదం తెలపనున్నారు. అనంతరం రెండు, మూడు రోజుల్లో తొలి జాబితాను బీజేపీ ప్రకటించే అవకాశముందని తెలుస్తోంది.
బుధవారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కిషన్ రెడ్డి తెలంగాణ ఎన్నికల వ్యూహం, అభ్యర్థుల ప్రకటనపై చర్చించారు. ఎన్నికల ప్రచారం ఎలా నిర్వహించాలి? ఎక్కడెక్కడ బహిరంగ సభలు నిర్వహించాలి? అనే విషయంపై కూడా సంప్రదింపులు జరిపారు. ఈ నెలలో మోదీ, అమిత్ షాతో పాటు కేంద్రమంత్రులు తెలంగాణలో ప్రచారం చేసేందుకు ఇప్పటికే షెడ్యూల్ ఖరారు అయింది. రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చిన నిధుల అంశాన్ని ప్రజలకు వివరించాలని బీజేపీ చూస్తోంది.