తెల్ల రేషన్ కార్డులు ఇవ్వడానికి రేవంత్ రెడ్డికి నొప్పేందుకు?.. కిషన్ రెడ్డి విమర్శలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కిషన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
దిశ, డైనమిక్ బ్యూరో: ఇచ్చిన ఏ ఒక్క హామినీ అమలు చేయకుండా దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాలయాపన చేస్తున్నారని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. అధికారంలోకి రాకముందు పెద్ద పెద్ద పెద్ద పొంకణాలు కొట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోకి వచ్చి ఏడు నెలలు అవుతున్నా సీఎం ఎక్కడున్నారని ప్రశ్నించారు. ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్న సోనియా గాంధీ ఎటుపోయారు ఆమె రాసిన లెటర్ ఎటు పోయిందని విమర్శించారు. మంగళవారం హైదరాబాద్ ధర్నాచౌక్ వద్ద బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. మహిళా మంత్రి లేకుండా కేసీఆర్ పరిపాలన సాగించి ఖ్యాతికెక్కితే.. నాటి నుంచి నేటి వరకు మాటకు కట్టుబడే చరిత్ర కాంగ్రెస్ కు లేదని ఎద్దేవా చేశారు. మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించిన ఘనత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానిదన్నారు. రాష్ర్ట చట్టసభలో 40 స్థానాల్లో మహిళలు ఉండాలని కోరుకుంటున్నానన్నారు.
నిద్రపోయి కలలు కనమంటున్నారా?:
రాష్ట్రంలోని మహిళలకు ప్రతి నెల రూ.2500 ఇస్తామన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటి వరకు వారికి రూ. 20 వేల బాకీ ఉందన్నారు. వృద్ధులకు రూ.4 వేల పించన్లు ఎప్పటి నుంచి ఇస్తారని ప్రశ్నించారు. అమలు కాని హామీలిచ్చి ప్రజలను నిలువునా ముంచారని ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణిస్తూ హాయిగా నిద్రపోండి.. ఆ నిద్రలో కలలు కంటూ మహిళలకు ఇస్తామన్న రూ.2500, స్కూటీ ఇచ్చినట్లు కలలు కనండి అనేలా రేవంత్ రెడ్డి వ్యవహారం నడుస్తున్నదన్నారు. ఉచిత బస్సు స్కీమ్ పెట్టి గ్రామీణ ప్రాంతాల్లో సగానికి పైగా బస్సు సర్వీసులు తగ్గించారని ధ్వజమెత్తారు. భయపెట్టి ఆర్ఆర్ ట్యాక్స్ లను వసూలు చేస్తూ రేవంత్ రెడ్డి తెలంగాణను దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. గడిచిన ఏడు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పథకాల పేరుతో వేల కోట్ల అప్పులు తెచ్చిందని అప్పుల విషయంలో కేసీఆర్ బాటలోనే కాంగ్రెస్ వెళ్తోందని విమర్శించారు. బెల్ట్ షాపులు రద్దు చేస్తామన్న రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక బెల్ట్ షాపులు విపరీతంగా పెరిగాయని డ్రగ్స్ నిర్మూలన మీద హడావుడి చేస్తున్న రేవంత్ రెడ్డి బెల్ట్ షాపులను ఎందుకు నిలువరించలేకపోతున్నారని ప్రశ్నించారు. బెల్ట్ షాపులు పేరు మీద పేద ప్రజల రక్తాన్ని తాగుతున్నారని ధ్వజమెత్తారు.
తెల్ల రేషన్ కార్డులు ఇవ్వడానికి నొప్పెందుకు?:
బంగారు తెలంగాణలో రేషన్ కార్డులు ఇచ్చుకోలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నామని, కేసీఆర్ రేషన్ కార్డులు ఇవ్వలేదని ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే బాటలో వెళ్తున్నారన్నారు. తెల్ల రేషన్ కార్డులు ఇవ్వడానికి రేవంత్ రెడ్డికి నొప్పేందుకని నిలదీశారు. కేంద్ర పథకాలు ప్రతి పేద వారికి అందాలంటే తెల్ల రేషన్ కార్డు కావాలన్నారు. మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేలా సీఎంపై ఒత్తిడి తీసుకువస్తామన్నారు. అందుకు మహిళా మోర్చ ఆధ్వర్యంలో భవిష్యత్ పోరాటాలు చేపడతామన్నారు.