భారత మాతను ఎవరూ హత్య చేయలేరు: రాహుల్‌పై కిషన్ రెడ్డి సీరియస్
గాంధీ భవన్‌కు, తెలంగాణ భవన్‌కు చాలా దగ్గరి సంబంధాలు ఉన్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు చేశారు.
దిశ, తెలంగాణ బ్యూరో: గాంధీ భవన్‌కు, తెలంగాణ భవన్‌కు చాలా దగ్గరి సంబంధాలు ఉన్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు చేశారు. ఢిల్లీలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తెలంగాణ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ వ్యతిరేక ఓటు చీలిపోవాలని, తద్వారా కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావాలని కుట్ర చేస్తున్నారన్నారు.
మొన్న కేటీఆర్ కేంద్రంలో సంకీర్ణం వస్తుందని, అందులో బీఆర్ఎస్ చేరుతుందని అన్నారని, దీన్ని బట్టి చూస్తే ఈ రెండు పార్టీలు ఒక్కటేననేది అర్థమవుతుందని పేర్కొన్నారు. వచ్చేది తమ ప్రభుత్వమే అని కేసీఆర్ పగటి కలలు కంటున్నారని ఎద్దేవాచేశారు. పార్లమెంట్‌లో కలిసి చేస్తున్న ధర్నాలు, ఒకరికి ఒకరు చేసుకుంటున్న సహాయం తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని, పైకి తిట్టుకుంటున్నా.. రెండు పార్టీల మధ్య లోపాయకారి ఒప్పందం ఉందని అనుమానం పేర్కొన్నారు.
ఈ రెండు పార్టీలను మజ్లిస్ సమన్వయం చేస్తోందని మండిపడ్డారు. 2014లో 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిస్తే 15 మంది బీఆర్ఎస్‌లో చేరారని, 2019లో 19 మంది గెలిస్తే 12 మంది బీఆర్ఎస్‌లో కలిశారని పేర్కొన్నారు. కనీసం రాజీనామా కూడా చేయకుండా మంత్రులుగా కొనసాగుతున్నారని ఫైరయ్యారు. ఏకంగా శాసనసభాపక్ష పార్టీని విలీనం చేశారని గుర్తుచేశారు. కాంగ్రెస్ తరుపున రాష్ట్రపతి అభ్యర్థికి బీఆర్ఎస్ నేతలు ఎలా స్వాగతం పలికారో, మద్దతు తెలిపారో ప్రజలంతా గమనించారని, ఈ రెండు పార్టీలు ఓకే తాను ముక్కలు అనేది దీని ద్వారా అర్థం చేసుకోవచ్చన్నారు.
మతోన్మాద పార్టీ అయినా మజ్లిస్ ఏవిధంగా సెక్యులర్ పార్టీ అయిందో ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం చెప్పాలని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. 100 కోట్ల హిందువుల సంగతి చూస్తామని, హైదరాబాద్‌లో మత ఘర్షణలకు కారణమైన మజ్లిస్ పార్టీ ఎలా సెక్యులర్ పార్టీ అవుతుందో చెప్పాలన్నారు. బీఆర్ఎస్‌కు ఓటు వేసినా కాంగ్రెస్‌కు ఓటేసినా మజ్లిస్‌ని బలపర్చినట్లే అవుతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం సీఎంకు తాను 40 కిపైగా లేఖలు రాశానని, ఇప్పటి వరకు ఒక్కదానిపై కూడా సమాధానం ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు. అందులో ఒక్క సమస్యను కూడా పరిష్కరించలేదన్నారు.
భారతమాత హత్య అంటూ రాహుల్ గాంధీ అవగాహనలేని, దుందుడుకు వ్యాఖ్యలు చేస్తున్నారని కిషన్ రెడ్డి ఫైరయ్యారు. వందల ఏళ్లుగా దేశ సంస్కృతిని, గౌరవాన్ని, చరిత్రను మంట గలిపేందుకు మొఘలులు మొదలు చైనా వరకు అనేకమంది ప్రయత్నం చేశారని, భారతమాతను హత్య చేశారంటూ చేసిన వ్యాఖ్యలను దేశ ప్రజలెవరూ హర్షించరని మండిపడ్డారు. భారత మాతను, హిందూస్తాన్‌ను ఎవరూ హత్య చేయలేరనే విషయాన్ని ఆయన గుర్తుంచుకోవాలని చురకలంటించారు. రాజకీయంగా విమర్శలు చేయొచ్చని, కానీ ఇలా మాట్లాడటం సరికాదని ధ్వజమెత్తారు.