థర్డ్ టైం బీజేపీ స్టేట్ చీఫ్‌గా కిషన్‌రెడ్డి.. ఆయన రాజకీయ ప్రస్థానమిదే!
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మూడోసారి నియామకమయ్యారు.
దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మూడోసారి నియామకమయ్యారు. సమైక్య రాష్ట్రంలో నాలుగేండ్లపాటు ఆయన అధ్యక్షుడిగా కొనసాగారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత రెండేండ్లు ఆయన ప్రెసిడెంట్‌గా ఉన్నారు. కాగా తాజాగా మరోసారి బీజేపీ జాతీయ నాయకత్వం ఆయనకు అవకాశం కల్పించింది. అది కూడా ఎన్నికల ఏడాదిలో హైకమాండ్ ఈ నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది. ఆయనపై నమ్మకం ఉంచి జాతీయ నాయకత్వం మరోసారి ఆయనకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టింది.
సాధారణ కార్యకర్త నుంచి..
కిషన్‌రెడ్డి రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపురం అనే గ్రామంలో 1964లో జన్మించారు. సాధారణ కార్యకర్తగా బీజేపీలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. 1980లో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరి అప్పటి నుంచి పార్టీకి సేవలందిస్తున్నారు. 1980లోనే రంగారెడ్డి జిల్లా బీజేవైఎం కన్వీనర్ పదవి చేపట్టారు. 1983 నాటికి బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శిగా, 1984లో ప్రధాన కార్యదర్శిగా, 1985లో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడిగా నియామకమయ్యారు.
1992లో బీజేవైఎం జాతీయ కార్యదర్శి, 1992లో ఉపాధ్యక్షుడిగా, 1994లో యువమోర్చా ప్రధాన కార్యదర్శి పదవులను పొందారు. 2001లో బీజేపీ రాష్ట్ర కోశాధికారిగా, 2004లో బీజేవైఎం జాతీయ అధ్యక్ష పదవులు ఆయన్ను వరించాయి. అంతేకాక ఉమ్మడి రాష్ట్రంలో ఆయన ఫ్లోర్ లీడర్‌గానూ కొనసాగారు. ఆయన పార్టీకి అందించిన సేవలను గుర్తించిన అగ్రనాయకత్వం రెండుసార్లు ఆయనను అధ్యక్షుడిగా నియమించింది. కాగా తాజాగా మూడోసారి ఆయనకు పార్టీ ప్రెసిడెంట్‌గా బాధ్యతలను అప్పగించింది.
ఎమ్మెల్యే టు సెంట్రల్ మినిస్టర్
కిషన్‌రెడ్డి 2004లో తొలిసారిగా హిమాయత్ నగర్ ఎమ్మెల్యేగా విజయం సాధించి శాసనసభలో అడుగుపెట్టారు. 2009 ఎన్నికల్లో అంబర్‌పేట్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 6 మార్చి 2010న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీ పగ్గాలు స్వీకరించారు. 2014 ఎన్నికల్లో అంబర్‌పేట్ ఎమ్మెల్యేగా 62,598 ఓట్ల మెజారిటీతో మూడోసారి గెలిచారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో తిరిగి తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రెండోసారి ఏకగ్రీవంగా నియమితులయ్యారు.
ఇదిలా ఉండగా కిషన్‌రెడ్డి 2018లో అంబర్‌పేట్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేశ్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఆపై 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి గెలిచారు. ప్రధాని మోడీ కేబినెట్‌లో కేంద్ర సహాయమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2021లో కేబినెట్ విస్తరణలో భాగంగా సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిశాఖ మంత్రిగా కిషన్‌రెడ్డి కొనసాగుతున్నారు. 2014 ఎన్నికల్లో కిషన్ రెడ్డి సారథ్యంలో బీజేపీ ఐదు అసెంబ్లీ స్థానాలు, ఒక ఎంపీ స్థానాన్ని దక్కించుకుంది. అందుకే కిషన్‌రెడ్డి అనుభవాన్ని ఇప్పుడు కూడా కొనసాగించాలని హైకమాండ్ నిర్ణయం తీసుకోవడం వల్లే మరోసారి పార్టీ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది.
Also Read: కేంద్ర కేబినెట్‌లోకి తెలంగాణ నుంచి ఇద్దరు?