ఖమ్మం నగరంలో క‘న్నీటి’ విషాదం

ఖమ్మం నగరంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి మున్నేరు గోదారిలా ఉగ్రరూపం దాల్చింది.

Update: 2024-09-03 02:01 GMT

దిశ, ఖమ్మం సిటీ: ఖమ్మం నగరంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి మున్నేరు గోదారిలా ఉగ్రరూపం దాల్చింది. రామన్నపేట నుంచి మొదులుకుని దానవాయిగూడెం, బ్రిడ్జి డౌన్, ఎఫ్‌సీఐ, ఎం బిగార్డెన్ పూర్తిగా మునిగి, రైల్వే ట్రాక్ దాటి రాపర్తి నగర్ కూరగాయల మార్కెట్ దాకా వరద పోటెత్తింది.30ఏళ్ల క్రితం బైపాస్ రోడ్డు మీదకు మాత్రమే నీళ్లు వచ్చాయి. కానీ ఇప్పుడు ఖమ్మం చరిత్ర రికార్డ్ బ్రేక్ చేసింది. నయాబజార్ సర్కిల్ నుంచి జూబ్లీ క్లబ్, రైల్వే బ్రిడ్జి వరకు నాలుగు అడుగుల లోతు వరద వచ్చింది. బైపాస్ రోడ్డు మీద ఉన్న లారీలు సైతం మునిగిపోయాయి. మోతినగర్, బొక్కలగడ్డ, నాయబజార్ వెనుక మంచికంటి నగర్, సుందరయ్యనగర్, ప్రకాశ్‌నగర్, శ్రీనివాస్‌నగర్ కాల్వకట్ట, దంసలపురం, ఇండ్లు మొత్తం మునిగిపోయి. మూడో పట్టణానికి రంగనాయకుల గుట్ట లేకపోతే గాంధీ చౌక్ నుంచి మొదలుకొని ముస్తఫా నగర్ మీదుగా జరిగే ప్రమాదం ఊహించుకుంటేనే వెన్నులో వణుకు వచ్చే పరిస్థితి.

మున్నేరు వరద రెప్ప పాటున రావడం తో రెండు మూడు ఫ్లోర్లు బిల్డింగ్ ఉన్న వారు పైకి ఎక్కి ప్రాణాలు రక్షించుకున్నారు. ప్రతి ఒక్కరి ఇంట్లో అన్ని సామాన్లు తడిచి ముద్దయిపోయాయి. ప్రకాశ్‌నగర్‌లోని టింబర్ డిపోలు నీటిలో కొట్టకుపోయి నేలమట్టమయ్యాయి. ప్రతి దుకాణంలోని టేకు కర్రలు, మిషన్లు నీటిలో మునిగి భారీ ఆస్తి నష్టాన్ని మిగిల్చింది. మున్నేరు పరీవాహక ప్రాంతానికి దగ్గరగా ఉన్న ప్రతి ఇంటికి పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. 31 డివిజన్లో పెద్దమ్మ తల్లి గుడి ప్రాంతంలో మున్నెటికి ఆనుకొని నిర్మించిన వెంచర్లో ఇండ్లు కట్టుకున్న వారందరికీ వరద కన్నీటిని మిగిల్చింది. 15 అడుగులకు పైగా వరద రావడంతో ఇండ్లలోని సామాన్లు మొత్తం బురదలో చిక్కుకుపోయాయి. ఓ పాల వ్యాపారికి గేదెల మరణం తీవ్ర నష్టాన్ని చేకూర్చింది. సోమవారం వరద తగ్గుముఖం పడడంతో ప్రజలు ఇండ్లలోకి చేరిన వరదను తొలిగించుకునే పనిలో పడ్డారు.

బీజేపీ శ్రేణుల సాయం..

ఖమ్మం నగరంలో రెండు రోజులుగా వరదల్లో చిక్కుకున్న బాధితులకు బీజేపీ ఖమ్మం పార్లమెంట్‌కి అభ్యర్థిగా పోటీ చేసిన తాండ్ర వినోద్ ఆధ్వర్యంలో ఆహార పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా అధికార ప్రతినిధి వీరవెల్లి రాజేష్, కార్యదర్శి నకిరేకంటి వీరభద్రం, మూడో పట్టణ అధ్యక్షులు కొనతం లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో రెండు రోజులుగా అల్పాహారం, మధ్యాహ్న భోజనాలు బాధితులకు అందించారు. 53వ డివిజన్ అధ్యక్షుడు రవికుమార్ గౌడ్ ఆధ్వర్యంలో స్థానిక మామిళ్లగూడెం బ్రిడ్జి కింద నిర్వాసితులకు అల్పాహారం అందజేశారు.


Similar News