సీఎంఆర్ గోల్‌మాల్ దోషులకు శిక్ష పడేనా..? కలెక్టర్‌కు కీలక ఆదేశాలు జారీ

సీఎంఆర్ ప్యాడి గోల్‌మాల్ దోషులకు శిక్షపడేనా..? లేక వారు కేసు నుంచి పక్కకు తప్పుకునేనా అనుమానం ప్రతి ఒక్కరిలో మెదులుతున్న ప్రశ్న.

Update: 2024-10-08 02:07 GMT

దిశ, ఖమ్మం సిటీ: సీఎంఆర్ ప్యాడి గోల్‌మాల్ దోషులకు శిక్షపడేనా..? లేక వారు కేసు నుంచి పక్కకు తప్పుకునేనా అనుమానం ప్రతి ఒక్కరిలో మెదులుతున్న ప్రశ్న. గత ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన ఈ సీఎంఆర్ ప్యాడి స్కీం రైతుల కంటే మిల్లర్లకు వారికి సహకరించిన అధికారులకే మేలు జరిగిందని తెలుస్తుంది. గత ఏడాది రబీ వరకు మిల్లర్లకు కేటాయించిన ప్యాడిలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినట్లు టాస్క్‌ఫోర్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నిగ్గుతేల్చిన ఇప్పటి వరకు ఆ ప్యాడి తాలూకు రికవరీపై జిల్లా అధికారులు చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలు తావిస్తోంది. అసలుకు మిల్లర్లకు ప్యాడిని కేటాయించే ముందు వారి నుంచి గ్యారంటీ బాండ్లను కానీ, ఆస్తులకు సంబంధించిన వివరాలు కానీ సేకరించకుండానే రూ.కోట్లు విలువ చేసే ప్యాడిని కేటాయించడం వల్లే ఇంత అనర్థం జరిగిందని ప్రజా సంఘాలు ఆగ్రహిస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ సొమ్మును కాజేసిన మిల్లర్లు వారికి సహకరించిన అధికారులు వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం లేకపోలేదని వామపక్ష పార్టీల నేతలు బహిరంగ విమర్శలు చేస్తున్నారు.

జిల్లాలో ఇప్పటికే రూ.300 కోట్లకు పైగా స్కాం జరిగినట్లు వస్తున్న ఆరోపణలపై జిల్లా అధికారులు నోరు మెదపకపోవడం పట్ల పలువురు నేతలు వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏ మిల్లు అయితే ప్రభుత్వం నుంచి తీసుకున్న ప్యాడికి బదులు బియ్యాన్ని ఎఫ్‌సీఐకి ఇవ్వలేదో ఆ మిల్లులపై, సహకరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయా సంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ సొమ్మును తమ సొంతానికి వాడుకుని రూ.కోట్లు గడించి ఇప్పుడు తమ తప్పేమీ లేదంటూ చేతులు దులుపుకునేందుకు ప్రయత్నిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. మిల్లర్ల ఆస్తులను జప్తు చేసి వారి నుంచి సొమ్మును రికవరీ చేస్తే ప్రభుత్వానికి మేలు జరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సీఎంఆర్ ప్యాడి గోల్‌మాల్ విషయం‌పై జిల్లా మంత్రులు ఘాటుగా స్పందించారు. తప్పు ఎవరు చేసినా వదిలిపెట్టవద్దని జిల్లా కలెక్టర్‌కు కూడా ఆదేశాలు జారీ చేశారు. రానున్న ఖరీఫ్ సీజన్ కల్లా ఇప్పుడు తప్పు చేసిన మిల్లర్లను బ్లాక్ లిస్టులో చేర్చి ఖరీఫ్ పంట ప్యాడిని కొత్త వారికి కేటాయించేలా చర్యలు తీసుకుంటేనే వారికి సరైన గుణపాఠం చెప్పినట్లు అవుతుందని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్యాడి‌ని పక్కదారి పట్టించిన మిల్లుల అధినేతలపై క్రిమినల్ కేసులు పెట్టి జైలుకు పంపాలని వారు ఆదేశించినట్లు సమాచారం.

ఇంత జరిగినా మిల్లర్లపై వారికి సహకరించిన అధికారులపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలుస్తుంది. కంటి‌తుడుపు చర్యల్లో భాగంగానే సుమారు రూ.50 కోట్లు విలువ చేసే ధాన్యాన్ని పక్కదారి పట్టించిన మిల్లు యజమానిపై కేవలం చీటింగ్ కేసు మాత్రమే నమోదు చేసినట్లు తెలిసింది. అయితే, వారికి సహకరించిన అధికారులపై మాత్రం శాఖపరమైన చర్యలు తీసుకోకుండా ఓ ఉన్నత అధికారిని వారిని విచారించడం కోసం నియమించినట్లుగా తెలుస్తోంది. తప్పులు చేసిన ప్రతి అధికారిని విచారణల పేరుతో కాలయాపన చేస్తే.. వారు తిరిగి తప్పులు చేస్తూనే ఉంటారని వామపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇప్పటికే జిల్లాలో పలు మిల్లులో తనిఖీలు చేసిన టాస్క్‌ఫోర్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు విచారణ చేపట్టి కుంభకోణాలు బయట‌పెట్టారే తప్పా.. వాటి వెనుక ఉన్న పాత్రధారులు, సూత్రధారుల పేర్లు బయటకు పెట్టకపోవడం శోచనీయం. ఏది ఏమైనప్పటికీ ఇంత పెద్ద స్థాయిలో అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటేనే అసలు నిజాలు బయటపడే అవకాశాలు ఉంటాయని ఆ సంఘాల ముఖ్య నాయకులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.


Similar News