ఆ రాబందు ఎక్కడిది ?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల అటవీ ప్రాంతంలో ఒక రాబంధు అధునాతన సాంకేతిక పరికరాలు ధరించి ప్రత్యక్షం కావడం సంచలనం రేపింది.

Update: 2024-10-02 10:45 GMT

దిశ, భద్రాచలం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల అటవీ ప్రాంతంలో ఒక రాబందు అధునాతన సాంకేతిక పరికరాలు ధరించి ప్రత్యక్షం కావడం సంచలనం రేపింది. మూడు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.... చర్ల శివారు అటవీ ప్రాంతానికి దగ్గరగా ఏకలవ్య పాఠశాల నిర్మిస్తున్నారు. రాత్రి సమయంలో ఒక రాబందు వచ్చి నూతనంగా నిర్మిస్తున్న భవనంపై వాలింది.

    భవన నిర్మాణ పనికి వచ్చిన ఉత్తరప్రదేశ్, బీహార్ కు చెందిన కార్మికులు రాబందును చూసి అలసిపోయి ఉన్నట్లుగా గ్రహించారు. కదలలేని పరిస్థితిలో ఉన్న దానిని తాడుతో కట్టి ఆహారం, నీరు అందించారు. కాగా రాబందు కాలుకు జీపీఎస్ ట్రాకర్, కెమెరా ఉండటం గ్రహించి తమవద్ద ఉన్న ఫోన్లతో వీడియోలు, ఫొటోలు తీశారు. రాబందు వీపుపై కూడా ఒక కెమెరా ఉండటం గ్రహించారు. ఈ విషయం సమీపంలోని వారికి తెలియడంతో రాబందును చూడడానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దాంతో భయపడిన కార్మికులు రాబందును వదిలేశారు.

ఎక్కడి నుండి వచ్చింది..?

అధునాతన పరికరాలు ధరించిన రాబందు ఎక్కడి నుండి వచ్చింది అనేది చర్చనీయాంశంగా మారింది. సరిహద్దు దేశాలు రాబందుకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి గుడాచారిగా పంపాయా..? లేక మావోయిస్టుల జాడ కోసం భద్రతా బలగాలు రాబందులను ఉపయోగించుకుంటున్నాయా..? మావోయిస్టులే పోలీసుల యాక్టివిటీస్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఈ విధంగా ఆధునిక పరిజ్ఞానం వాడుతున్నారా అనేది ఇప్పుడు ప్రశ్నార్ధకరంగా మారింది. ఈ సంఘటన జరిగి మూడు రోజులు గడుస్తున్నా చర్ల పోలీసులకు బుధవారం ఉదయం సమాచారం అందినట్లు తెలిసింది. కానీ అప్పటికే కార్మికులు రాబందును వదిలి వేయడంతో అది ఎక్కడి నుండి వచ్చిందనేది మిస్టరీగానే మిగిలింది. 

Tags:    

Similar News