తమ్మినేని హత్య కేసులో నిందితులు ఎక్కడ.. ఆ వార్తలు నిజమేనా..??

తెల్దారుపల్లి గ్రామానికి చెందిన టీఆర్ఎస్​నాయకుడు తమ్మినేని క్రిష్ణయ్య ఈ నెల 15న సీపీఎం నాయకుల చేత దారుణంగా హత్య చేయబడిన విషయం తెలిసిందే.

Update: 2022-08-18 11:18 GMT

దిశ, ఖమ్మం రూరల్: తెల్దారుపల్లి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ ​నాయకుడు తమ్మినేని క్రిష్ణయ్య ఈ నెల 15న సీపీఎం నాయకుల చేత దారుణంగా హత్య చేయబడిన విషయం తెలిసిందే. అనంతరం పోలీసులు 8మంది సీపీఎం నాయకులపై కేసు నమోదు చేశారు. హత్య జరిగి నేటికి ఐదు రోజులు గడుస్తోన్న ఇంత వరకు ఎంత మందిని అరెస్ట్​ చేశారో.. అధికారికంగా పోలీసులు తెలపలేదు. తాజాగా గురువారం ఆంధ్రా సరిహద్దులో 6 గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, ఇంకా తమ్మినేని కోటేశ్వరరావు, జక్కంపుడి క్రిష్ణ అచూకీ లభించలేదని ఓ టీవీ చానెల్‌లో స్క్రోలింగ్ ​వచ్చింది.

మరికొంత సేపటికి క్రిష్ణయ్య హత్య కేసులో 12మంది ఉన్నారని.. వారిలో 11మందిని అదుపులోకి తీసుకున్నట్లు ఓ చానెల్‌లో ప్రసారమైంది. ఇలా పుకార్లు షికార్లు చేస్తున్నాయి కానీ.. పోలీసులు మాత్రం ఇంత వరకు నిందితులు ఎక్కడ ఉన్నారు.. అదుపులోకి తీసుకున్నారా..? లేదా అనే దానిపై నోరు మెదపడం లేదు. రూరల్​మండలంలో ఓ టీఆర్ఎస్​నేత ఇంట్లో పోలీసులు సోదాలు చేసినట్లు సైతం ఓ చానెల్‌లో ప్రసారం జరిగింది. పోలీసులను వివరణ అడిగితే అటువంటి సోదాలు ఎక్కడ చేయలేదని తెలపడం కొసమెరుపు. అసలు నిందితులు పోలీసులు అదుపులో ఉన్నారా..? లేక ఎక్కడైనా తలదాచుకున్నారా..? అనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. కానీ పుకార్లు మాత్రం షికార్లు చేస్తున్నాయి. దీనిపై పోలీసులు నోరు మెదిపితేనే సరైన సమాధానం లభించనుంది.

తమ్మినేని కృష్ణయ్య హత్య కేసు దర్యాప్తులో పోలీసుల పురోగతి.. హత్యలో పాల్గొన్న నిందితుల దుస్తులు, ఆయుధాలను స్వాధీనం..? హత్య తరువాత నిందితులు షెల్టర్ తీసుకున్న ప్రాంతం నుండి కీలక ఆధారాలు సేకరించినట్లు విశ్వసనీయ సమాచారం. ఇదిలా ఉండగా.. తమ్మినేని క్రిష్ణయ్య హత్యతో అలర్ట్ అయిన పోలీసులు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకు తెలంగాణ ప్రభుత్వం 1+1 భద్రత కల్పించినట్లు తెలుస్తోంది.


Similar News