తొమ్మిదో రోజుకు చేరిన సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె

సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరవధిక సమ్మె 9వ రోజుకు చేరింది.

Update: 2024-12-18 11:58 GMT

దిశ, కొత్తగూడెం : సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరవధిక సమ్మె 9వ రోజుకు చేరింది. తొమ్మిదో రోజు సమ్మెలో భాగంగా జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట మంగళవారం రాత్రి చనిపోయిన తిరుమలాయపాలెం మండలం ఖమ్మం జిల్లా కంప్యూటర్ ఆపరేటర్, మెసెంజర్ యాకయ్య చిత్రపటాలకు బుధవారం శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట సమగ్ర శిక్ష ఉద్యోగులు బతుకమ్మ ఆడి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మోహన్ మాట్లాడుతూ.. ఇలా ఎంతమందిని పొట్టన పెట్టుకుంటారని, ఇప్పటికే చాలామంది సమగ్ర శిక్ష ఉద్యోగులు చనిపోతున్నారని, వారికి కనీసం దహన సంస్కారాలకు పదివేల రూపాయలు కూడా సహాయం చేయడం లేదన్నారు.

    జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ కనీసం స్పందించకపోవడం అత్యంత శోచనీయమన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపే పూర్తి కార్యాచరణ రూపొందించి సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యూలర్ చేయాలని, లేని పక్షంలో తక్షణమే పే స్కేల్ అమలు చేయాలని కోరారు. ఆరోగ్య భద్రత కల్పించాలని, మరణించిన కుటుంబాలకు 25 లక్షల రూపాయల ఎక్స్​గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఎమ్మెల్యేలను, మంత్రులను ఘెరావ్ చేస్తామని హెచ్చరించారు. వీరికి డీవైఎఫ్ఐ నాయకులు హరికృష్ణ సంఘీభావాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు ఎం.తులసి, కవిత, సుశీల,పార్వతి, వనమా సురేష్, సిద్దయ్య, కిషన్​ పాల్గొన్నారు. 


Similar News