జమిలి ఎన్నికలు చాలా ప్రమాదకరం
దేశంలో జమిలి ఎన్నికలు చాలా ప్రమాదకరమని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు.
దిశ, సత్తుపల్లి : దేశంలో జమిలి ఎన్నికలు చాలా ప్రమాదకరమని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. బుధవారం సత్తుపల్లి పట్టణంలో లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ హాల్ లో మోరంపూడి పుల్లయ్య ప్రాంగణంలో నిర్వహించిన భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) ఖమ్మం జిల్లా 22వ మహాసభలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మొదట సత్తుపల్లి స్థానిక రావి వీరవెంకయ్య భవనం నుంచి మహాసభ వేదిక వరకు వందలాది మంది కార్యకర్తలతో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఇటీవల పార్టీలో మృతి చెందిన కార్యకర్తలకు సంతాప తీర్మానం ప్రకటించి రెండు నిమిషాలు మౌనం పాటించారు. సభను ఉద్దేశించి బీవీ రాఘవులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాల్లో మహాసభలు జరుగుతున్నాయని, ఈ మహాసభల్లో దేశం ఎదుర్కొంటున్న సమస్యల గురించి చర్చిస్తామని, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను తయారు చేస్తున్నామని ఆయన అన్నారు.
75 ఏళ్ల దేశ రాజ్యాంగానికి నష్టం కలిగించే అనేక అంశాలు బీజేపీ ప్రవేశ పెడుతుందని అన్నారు. రాజ్యాంగ హక్కులను ధ్వంసం చేయాలని కొన్ని కార్పొరేట్ శక్తులు చూస్తున్నాయని, దీని నుంచి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని కోరారు. మత తత్వ రాజ్యాంగాన్ని తేవాలని బీజేపీ చూస్తుందని ఆరోపించారు. రైతులను ఆదుకునేందుకు ఈ ప్రభుత్వం ముందుకు రావడం లేదన్నారు. రైతులను నాశనం చేసేందుకు నల్ల చట్టాలను ఏర్పాటు చేస్తుందని, వాటికోసం ఇప్పుడు కేంద్రంలో జీఎస్టీ కౌన్సిలింగ్ పేరుతో ఒక కమిటీని ఏర్పాటు చేశారని తెలిపారు. బొగ్గు గనులు, విద్యుత్ రంగాలను అదానికి దోచి పెడుతున్నారని, దాంతో సిరియా లాంటి పరిస్థితి ఇక్కడ ఏర్పడే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. జమిలి ఎన్నికలతో దేశంలో ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే కుట్ర చేస్తుందని అన్నారు. ఢిల్లీ ఎన్నికల్లో గెలవడం కోసమే జమిలి ఎన్నికల డ్రామా ను బీజేపీ ముందుకు తీసుకొచ్చిందన్నారు. దళితులు, మైనార్టీల మీద కక్ష తీర్చుకునే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు.
ప్రశ్నించే గొంతుక ఎర్రజెండా
రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుక ఎర్ర జెండా అని అన్నారు. బీజేపీని ఎదుర్కొనేందుకు గత ఎన్నికల్లో కాంగ్రెస్ను సమర్ధించామని తెలిపారు. అంతేకాని కాంగ్రెస్ పై నమ్మకంతో కాదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫ్రీ బస్ తప్ప ఏ వాగ్దానం అమలు చేయలేదని అన్నారు. హైడ్రా పేరుతో అక్రమ కట్టడాలను కూల్చకుండా సామాన్యుల ఇల్లు కూల్చితే ప్రజల పక్షాన నిలబడుతుందని అన్నారు. మూసీ ప్రక్షాళన పేరుతో ప్రజలను ఇబ్బంది పడితే చూస్తూ ఊరుకోమని, రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఫార్మా కంపెనీల నుంచి మూసీ నదిలోకి వెలుపడే వ్యర్థాలను నిలువరించాలని సవాల్ చేశారు. ఫార్మాసిటీ పేరుతో రెండు పంటలు పండే పేదల భూములను లాక్కుంటామంటే ఊరుకోమన్నారు.
రామగుండం ప్రాజెక్టు పేరు చెప్పి మూడు వేల ఎకరాల చెట్లు నరికారని, రాష్ట్రంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి కేసీఆర్ మార్కును కనుమరుగు చేశారని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి సంక్షేమం కోసం పోరాడుతామని తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యదర్శి వెంకట్, కేంద్ర కమిటీ సభ్యులు సాయిబాబా, రాష్ట్ర కమిటీ సభ్యులు సుదర్శన్, పాలడుగు భాస్కర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇన్చార్జి కనకయ్య, ఉమ్మడి ఖమ్మం జిల్లా నాయకులు సోమయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు మక్కా వెంకటేశ్వరరావు, బుర్రి వెంకన్న, తాళ్ల నాగరాజు, పార్టీ సీనియర్ నాయకులు తాతా భాస్కర్, మోరంపూడి పాండురంగారావు, మాచర్ల భారతి, జాజిరి శ్రీనివాస్ , జాజిరి జ్యోతి, పట్టణ కార్యదర్శి కొలకపోగు సర్వేశ్వరరావు, ఖమ్మం జిల్లా, సత్తుపల్లి, వైరా, మధిర, పాలేరు, డివిజన్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.