అనంతారంలో కిడ్నీ వ్యాధులు
మండల పరిధిలోని అనంతారం గ్రామంలో గత కొంతకాలంగా గ్రామస్తులు కిడ్నీ వ్యాధులకు గురవుతున్నారు.
దిశ, జూలూరుపాడు : మండల పరిధిలోని అనంతారం గ్రామంలో గత కొంతకాలంగా గ్రామస్తులు కిడ్నీ వ్యాధులకు గురవుతున్నారు. చిన్నాపెద్ద తేడా లేకుండా అందరికీ కిడ్నీ వ్యాధి రావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. సుమారు 700 మంది జనాభా ఉన్న గిరిజన గ్రామంలో 50 మంది వరకు కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారంటే ఆ గ్రామంలో ఏదో సమస్య ఉందనేది అర్థమవుతోంది.
కొందరు డయాలసిస్ చేయించుకుంటుంటే మరికొందరికి క్రియాటిన్ లెవెల్స్ పెరుగుతున్నాయి. దాంతో ఊరికి ఏమైనా అరిష్టం జరిగిందనే చర్చ జరుగుతుంది. ఈ విషయమై స్పందించిన జిల్లా కలెక్టర్ హెల్త్ అధికారులను అప్రమత్తం చేసి క్యాంపులు ఏర్పాటు చేయాలని, బ్లడ్ శాంపిల్స్ సేకరించాలని ఆదేశించారు. దాంతో ఆ పనిలో హెల్త్ అధికారులు నిమగ్నమయ్యారు. మరోపక్క మండల అధికారులు సైతం ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మండల అధికారి కరుణాకర్ రెడ్డితో పాటు ఎంపీఓ తులసి రాములు పాల్గొన్నారు.