ఖమ్మం పట్టణానికి విపత్తు తెచ్చిపెట్టిన రియల్ ఎస్టేట్ మాఫియా..?

వర్షాకాల మంటేనే ఖమ్మం నగరం గజగజ వణుకుతున్నది.

Update: 2024-09-03 02:20 GMT

దిశ, ఖమ్మం బ్యూరో: వర్షాకాల మంటేనే ఖమ్మం నగరం గజగజ వణుకుతున్నది. రెండు రోజులుగా కురుస్తున్న వానలతో పలు ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో పునరావాస కేంద్రాలకు వెళ్లి తలదాచుకోవాల్సిన పరిస్థితి నెలకొన్నది. వెంచర్ల పేరిట రియల్ మాఫియా కుంటలు, చెరువులు స్వాహా చేయడం, ఎఫ్‌టీల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు చేపట్టడమే దీనంతటికి కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు సరైన ప్రణాళిక లేకుండా సుందరీకరణ, విస్తరణ పేరుతో అనాలోచితంగా గత ప్రభుత్వం చేపట్టిన పనులు కూడా వర్షాకాలంలో నగరవాసులకు నిలువనీడ లేకుండా చేసిందనే విమర్శలున్నాయి.

మున్నేరు చుట్టూ అక్రమ నిర్మాణాలు..

రియల్ అక్రమార్కుల ధన దాహానికి మున్నేరు పరివాహక ప్రాంతాలు కుచించుకుపోయాయి. ఖమ్మం నగరంలో దాదాపు 15 కిలోమీటర్ల మేర మున్నేరు ఎఫ్‌టీఎల్ పరిధి విస్తరించి ఉంది. గడిచిన పదేండ్ల కాలంలో ఇక్కడ యథేచ్ఛగా నిర్మాణాలు చేపట్టారు. బహుళ అంతస్తులు, అపార్ట్‌మెంట్లు, ఫంక్షన్ హాళ్లు, పెద్ద పెద్ద షెడ్లు, వ్యాపార సముదాయాలు ఏర్పాటు చేశారు. పలుకుబడి, ప్రజాప్రతినిధులతో ఉన్న పరిచయాలతో కొందరు రియల్ వ్యాపారులు అనుమతులు తెచ్చుకోగా, నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టారు. దీనికి అధికారులు కూడా సహకరించారనే ఆరోపణలున్నాయి. అంతా తెలిసినా అప్పటి ప్రజాప్రతినిధులు చూసీచూడనట్టు వ్యవహరించినట్లు తెలుస్తున్నది. ఇప్పుడు ఈ నిర్మాణాలు వరద ప్రవాహానికి అడ్డంకిగా మారి.. ఇండ్లలోకి నీరు వస్తున్నదనే విమర్శలున్నాయి.

వరదలు రావడంతో..

మున్నేరుకు ప్రస్తుతం బైపాస్ రోడ్డు, కాల్వొడ్డు, ప్రకాష్ నగర్ బ్రిడ్జిల నుంచి వరద ప్రవాహం వస్తుంది. అంతేకాకుండా వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల నుంచి ప్రవహించే ఆకేరు, మున్నేరు, ఇతర చిన్న వాగుల వరద ఇక్కడి నుంచే ప్రవహిస్తున్నది. గతేడాది 30.5 మీటర్ల ఎత్తు వరకు వరద ప్రవాహం కొనసాగగా.. ఇప్పుడు 36.5 మీటర్ల ఎత్తు మేర వరదలు వచ్చాయి. దీంతో వందలాది కుటుంబాలు వీధిన పడ్డాయి. చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయంభయంగా గడిపారు. కొందరు ఇంటి స్లాబ్ పైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకోగా.. మరికొందరు అపార్టుమెంట్లలో తలదాచుకున్నారు.

లకారం వద్ద ఇదే పరిస్థితి..

ఖమ్మం నగర నడిబొడ్డున ఉన్న లకారం చెరువు ఎఫ్‌టీల్ పరిధిలో అనేక నిర్మాణాలు చేపట్టారు. లకారం దగ్గరలో ఉన్న ప్రభుత్వ భూమిని పర్యాటక శాఖ ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పడంతో ఈ పరిస్థితి నెలకొందని తెలుస్తున్నది. లకారం చుట్టూ వాక్ వే నిర్మించడంతో వరద ప్రవాహం లకారంలోకి వెళ్లే మార్గం లేకుండా పోయింది. దీంతో వరద వెనక్కి పోటెత్తడంతో కవిరాజ్ నగర్ కాలనీ, పాత కలెక్టరేట్ వెనుక ప్రాంతాలు, చెరువు బజార్, చైతన్య నగర్ తదితర ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. ప్రకాశ్ నగర్ బ్రిడ్జి వద్ద నిర్మించిన చెక్ డ్యాం ఎత్తు ఎక్కువగా ఉండటం, ఇక్కడా ఎస్‌ఎల్ లో నిర్మాణాలు జరగడంతో వరద ప్రవాహం ముందుకు సాగక.. కోట నారాయణ పురం, ప్రకాష్ నగర్, మోతే నగర్, టీచర్స్ కాలనీ, జలగం నగర్, కాల్వొడ్డు, స్మశాన వాటిక ప్రాంతాలు వరద నీటి ముంపునకు గురయ్యాయి.

ప్రణాళిక లేని సుందరీకరణతో..

సుందరీకరణ పేరుతో గత ప్రభుత్వం ఖమ్మం నగరంలో రూ. కోట్లు కుమ్మరించినా.. ప్రణాళిక లేని పనులతో వరదలు ఎక్కువయ్యాయనే ఆరోపణలున్నాయి. చెరువులను కుదించి, వాటిపై ట్యాంక్ బండ్లు, రోడ్లు వేసి మూసివేశారు. గోళ్లపాడు ఛానల్ మొత్తం పూడ్చి పార్కులు కట్టారు. రఘునాథపాలెం నుంచి లకారం చెరువు వరకు ఉన్న లింకు చెరువులు అస్తవ్యస్తంగా మారాయి. మున్నేరుకు వరద వస్తే ఇంతకు ముందు త్రీ టౌన్ ఏరియా, మోతీనగర్, బొక్కలగడ్డకు మాత్రమే పరిమితయ్యేది. నేడు ఖమ్మం మొత్తం అతలాకుతలం అవుతున్నది. వర్షాల కారణంగా నీటి ప్రవాహం ఎటూ వెళ్లలేక ఇండ్లలోకి వస్తుంది. పర్యాటకం పేరిట ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం, వారి వ్యాపార విస్తరణ పేరిట జరిగే విధ్వంసం కారణంగా వరదలు వస్తున్నాయని నగర ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వరదల్లోనూ హైడ్రా డిమాండ్..

ఖమ్మంలో ఎకరం భూమి రూ. కోట్లు పలుకుతుండడంతో రియల్ వ్యాపారులు చెరువుల దగ్గర భూములను ఆక్రమించుకున్నారు. చెరువులు, కుంటలు కబ్జా చేసి వెంచర్లు వేశారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టారు. దీంతో ఖమ్మంలోనూ హైడ్రా లాంటి వ్యవస్థ ఏర్పాటు చేసి అక్రమ నిర్మాణాలపై కొరడా ఝుళిపించాలని నగర వాసులు కోరుతున్నారు.


Similar News