కొత్తగూడెం జిల్లాలో తీవ్ర విషాదం.. మనస్తాపంతో బాలిక ఆత్మహత్య

కొత్తగూడెం జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

Update: 2024-07-12 04:31 GMT

దిశ, కొత్తగూడెం: కొత్తగూడెం జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బాలికను గురుకుల పాఠశాలకు వెళ్లమన్నందుకు తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. సుజాతనగర్ మండలం గరిబ్‌పెట్ గ్రామంలో నివాసం ఉంటున్న బుర్ర లిడియా (12)‌కు ఎస్సీ గురుకుల పాఠశాలలో ఐదో తరగతిలో సీటు లభించింది. పది రోజుల క్రితం గురుకులానికి వెళ్లిన లిడియా జ్వరం వచ్చిందని ఇంటికి తిరిగొచ్చింది. అయితే, తిరిగి గురుకులానికి వెళ్లాలని గురువారం లిడియాను తల్లిదండ్రులు కోరారు. అయితే అక్కడికి వెళ్లేందుకు ఇష్టం లేక తీవ్ర మనస్తాపానికి గురైన లడియా సాయంత్రం ఏడు గంటల సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తల్లిదండ్రులు తమ కుమార్తె ఆత్మహత్య చేసుకోవడంతో కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనతో గరీబ్‌పెట్ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. గ్రామస్థలు సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొత్తగూడెం సర్వజన ఆసుపత్రికి తరలించారు.


Similar News