బీఆర్ఎస్ ఇచ్చే డబ్బులు తీసుకుని కాంగ్రెస్ కి ఓటు వేయండి
బీఆర్ఎస్ పార్టీ వద్ద డబ్బు తీసుకోండి కాంగ్రెస్ కి ఓటు వేసి గెలిపించండి అంటూ కొత్తగూడెంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమైంది.
దిశ ప్రతినిధి,కొత్తగూడెం : బీఆర్ఎస్ పార్టీ వద్ద డబ్బు తీసుకోండి కాంగ్రెస్ కి ఓటు వేసి గెలిపించండి అంటూ కొత్తగూడెంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమైంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు డబ్బులు తీసుకుని బయల్దేరారు తప్పు కాదని, ఆ డబ్బులు తీసుకోండి అవి మీవే మీ దగ్గరే వివిధ పన్నుల రూపంలో వసూలు చేసినవని పేర్కొన్నారు. వాటిని తీసుకుని రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తెలంగాణ ఇచ్చిన సోనియమ్మను దీవించండని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. కొత్తగూడెం నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం ఆయన పర్యటించారు. చుంచుపల్లి తండాలో ఆ ప్రాంత నాయకులు హేమ్ల, కిషాన్, మురళి, చిన్నా, రాందాస్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వివిధ పార్టీల నుంచి సుమారు 200 కు పైగా కుటుంబాలు, గంగా హుసేన్ బస్తీ ఐదవ వార్డు లో ఖమర్, వెంకన్న ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో యూత్ నాయకులు పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరైన పొంగులేటి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు పొంగులేటిని గజమాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమాలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఎంతో మంది ఉద్యమకారులు, మేధావులు, అన్ని వర్గాల ప్రజల పోరాట ఫలితంగా సాధించుకున్న తెలంగాణలో వారి కలలు కల్లలుగానే మిగిలి పోయాయన్నారు. తెలంగాణ ప్రజల చిరకాల వాంఛను గుర్తించి ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియమ్మకు ఈసారి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి కానుకగా ఇవ్వాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో చందాలు, దందాలు అవినీతి... అక్రమలే రాజ్యమేలుతున్నాయని విమర్శించారు. ప్రజల అశీస్సులు, దీవెనలతో రాబోయే ఇందిరమ్మ రాజ్యంలో అవినీతికి ఏ మాత్రం ఆస్కారం ఉండదని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రజలకు సోనియమ్మ ప్రకటించిన ఆరు హామీలను అధికారంలోకి వచ్చాక పక్కాగా అమలు చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నపుడు మైనార్టీ లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలుచేసి వారికి న్యాయం చేసిందని అన్నారు.
కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం వారికి ఇచ్చిన హామీలను తుంగలోకి తొక్కిందని విమర్శించారు. లిక్కర్ దందాలో ఉన్న తన కూతురు కవితను కాపాడుకునేందుకే బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో చేతులు కలిపిందన్నారు. ఇంకా ఎన్నో లోపాయికార ఒప్పందాలు ఈ రెండు పార్టీ ల మధ్య ఉన్నాయని ఆరోపించారు. బీజేపీకి బీఆర్ఎస్ బీటీమ్ అనడంలో ఎటువంటి సందేహం లేదన్నారు. మహిళలకు, నిరుద్యోగులకు, వృద్దులకు, రైతులకు ఇంకా అనేక వర్గాల ప్రజలకు న్యాయం జరగాలంటే అది ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమని తెలిపారు. కొత్తగూడెం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసే అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. అనంతరం ఆయా ప్రాంతాల్లో పర్యటించి పలు కుటుంబాలను పరామర్శించి ఆర్థికసాయాలను అందచేశారు. అదేవిధంగా క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరిచిన ఓ విద్యార్థినిని అభినందించారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ రాష్ట్ర నాయకులు ఊకంటి గోపాలరావు, నాగ సీతారాములు, తూము చౌదరి, ఆళ్ల మురళి, నాగేంద్ర త్రివేది, పెద్ద బాబు, కనకరాజు, ఆయూబ్ ఖాన్, శివా రెడ్డి, దేవరగట్ల ప్రసాద్, గౌస్ పాషా, నాగేందర్, సతీష్ , పండు, నరేష్, నాగేశ్వరరావు, ఆవుల మధు తదితరులు పాల్గొన్నారు.