కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు చేరాలి.. ఆకునూరి మురళి..
విద్యార్థి దశలోనే కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు చేరాలని రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి అన్నారు.
దిశ, కొత్తగూడెం : విద్యార్థి దశలోనే కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు చేరాలని రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి అన్నారు. సోమవారం సాయంత్రం భోజన సమయం అనంతరం కొత్తగూడెంలోని రామవరం బాలుర పోస్ట్ మెట్రిక్ వసతి గృహాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో మాట్లాడుతూ విద్యార్థి దశ ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైనదని, సమయం వృధా చేయకుండా ప్రతి నిమిషాన్ని సద్వినియోగపరుచుకోవాలని అన్నారు. హాస్టల్లో అందిస్తున్న మెను పై ఆరా తీశారు.
ప్రతి గదికి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. సుమారు అరగంట పాటు హాస్టల్ ఆవరణ మొత్తం తిరిగి, విద్యార్థులకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు వసతి గృహంలో తమకు గదులు సరిపోవడం లేదని అదనపు గదులు అవసరం ఉన్నదని తెలిపారు. అదేవిధంగా హాస్టల్లో డ్రైనేజీ సౌకర్యం సరిగ్గా లేదని, దుర్గంధం వస్తుందని బాత్రూంల నుండి వెళ్లే నీరు నేరుగా హాస్టల్లోని ఓ గుంతలో నిల్వ ఉంటుందని, దీనివల్ల దోమలు పెరిగిపోతున్నాయని విద్యా కమిషన్ చైర్మన్ కు తెలిపారు. నూతన డ్రైనేజ్ ఏర్పాటు చేయించాలని ఆయనని కోరారు.