ఆంతర్యం అదేనా..?!

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావును మంత్రులు హరీశ్ రావు, పువ్వాడ అజయ్ కుమార్...Special Story of Khammam Politics

Update: 2023-01-11 16:46 GMT

దిశ, ఖమ్మం బ్యూరో: మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావును మంత్రులు హరీశ్ రావు, పువ్వాడ అజయ్ కుమార్ కలిశారు. బుధవారం ఖమ్మం వచ్చిన హరీశ్ రావు సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో కంటి వెలుగు కార్యక్రమ ప్రారంభోత్సవంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆ తర్వాత రాత్రి సమయంలో దమ్మపేట మండలం గండుగులపల్లిలోని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నివాసానికి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో కలిసి వెళ్లారు. వెళ్తూ మార్గ మధ్యంలో సత్తుపల్లి పట్టణంలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యను సైతం తన కార్లో తీసుకెళ్లారు. కొంతకాలంగా పార్టీపై అసంతృప్తిగా ఉన్న తుమ్మల నాగేశ్వరావు ఇంటికి మంత్రులు వెళ్లడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇటీవల తుమ్మల నాగేశ్వరావు ఈసారి పాలేరులో పోటీ చేయడం ఖాయమని ప్రకటించడం.. దానికి తగ్గట్లు నియోజకవర్గంలో పర్యటనలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. అంతేకాదు.. తన అనుచరులను రంగంలోకి దింపి టీడీపీ మద్దతు కోసం ప్రయత్నించినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. మరోవైపు అధికార పార్టీ తరఫున తానే పోటీచేస్తానంటూ పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి సైతం ప్రకటనలు చేయిస్తూ నియోజకవర్గంలో కార్యాచరణ ఇప్పటినుంచే మొదలు పెట్టారు. ఈ క్రమంలో తుమ్మల ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారని బీఆర్ఎస్ శ్రేణుల్లో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి.

తుమ్మల పార్టీ మారుతారనేనా..?

మాజీ ఎంపీ పొంగులేటి బీజేపీలో చేరుతున్నారంటూ రెండ్రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఒకవేళ పొంగులేటి బీజేపీలో చేరితే బీజేపీ భారీగా పుంజుకోవడమే కాకుండా.. బీఆర్ఎస్ కు కోలుకోలేని దెబ్బ తగులుతుంది.. అదే టైంలో సీనియర్ నేతగా పేరుతన్న తుమ్మల సైతం పార్టీ మారుతున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో ఊపందుకుంది. పార్టీ మారి పాలేరు నుంచి రంగంలోకి దిగుతారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.. అసలే పొంగులేటి పార్టీ మారితే బీఆర్ఎస్ కు భారీ దెబ్బ ఖాయంగా చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో తుమ్మల నాగేశ్వరరావు సైతం కారు దిగితే ఇక ఉమ్మడి ఖమ్మంలో పార్టీ గల్లంతు కావడం ఖాయంగా భావించిన సీఎం కేసీఆర్ మంత్రి హరీశ్ రావును తన దూతగా పంపి.. తుమ్మలను బుజ్జగించే బాధ్యతను అప్పగించినట్లు సమాచారం. అందుకే మంత్రి అజయ్ తోపాటు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సహా పలువురు ముఖ్యనేతలను వెంటబెట్టుకుని తుమ్మల ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఉమ్మడి ఖమ్మంలో బీఆర్ఎస్ పట్టు చిక్కకుండా ఉండేందుకు పార్టీ అధిష్టానమే చర్యలకు ఉపక్రమించినట్లు సమాచారం.


Similar News