సింగరేణి ఉజ్వల భవిష్యత్​కు సమిష్టిగా శ్రమించాలి

సింగరేణి సంస్థ పురోభివృద్ధి, ఉజ్వల భవిష్యత్​కు కార్మికులు, ఉద్యోగులు, అధికారులు సమిష్టిగా శ్రమించాలని కొత్తగూడెం శాసనసభ సభ్యులు, గుర్తింపు సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు కూనంనేని సాంబశివరావు సూచించారు.

Update: 2024-10-11 10:03 GMT

దిశ,కొత్తగూడెం : సింగరేణి సంస్థ పురోభివృద్ధి, ఉజ్వల భవిష్యత్​కు కార్మికులు, ఉద్యోగులు, అధికారులు సమిష్టిగా శ్రమించాలని కొత్తగూడెం శాసనసభ సభ్యులు, గుర్తింపు సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు కూనంనేని సాంబశివరావు సూచించారు. సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో భూగర్భ గనులు, ఉపరితల గనులు, అనుబంధ విభాగాల్లో శుక్రవారం నిర్వహించిన ఉజ్వల సింగరేణి...కార్మికుల పాత్ర కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలకు మాత్రమే పరిమితమై తెలంగాణ రాష్ట్రానికి తలమానికమైన సింగరేణి సంస్థను మరింత అభివృద్ధి వైపు నడిపించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.

     గత ప్రభుత్వం కార్మికుల సంక్షేమాన్ని విస్మరించిందని, కార్మికుల కష్టార్జితాన్ని అప్పనంగా దోచుకొని తమ ఖజానాను నింపుకుందని, సీఎస్ఆర్ నిధులు కోల్ బెల్ట్ ప్రాంతాల అభివృద్ధికి కాకుండా మంత్రుల నియోజకవర్గాలకు మళ్లించుకొని అన్యాయం చేశారని, మితిమీరిన రాజకీయ జోక్యంతో సంస్థను బ్రష్టుపట్టించారని ఆరోపించారు. ఇలాంటి పరిస్థితులకు భిన్నంగా ప్రస్తుత ప్రభుత్వం వ్యవహరించాలని సూచించారు. ఒకపూట భోజనం, ఒక స్వీట్ బాక్సుతో కార్మికులు, ఉద్యోగులు సంతృప్తి చెందరని, వారి సంక్షేమం కోసం కృషి చేయాలన్నారు. ఉత్పత్తి, ఉత్పాదకతపైనే దృష్టిపెడితే సరిపోదని కార్మికులు, కార్మిక కుటుంబాలకు, కార్మిక వాడలకు కావాల్సిన సదుపాయాలు, చట్టపరమైన హక్కులు కల్పించి ఆరోగ్యవంతమైన అభివృద్ధి సాధించాలని సూచించారు.

    కార్మికుల సంక్షేమంపై యాజమాన్యం, ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. ఇటీవల కాంట్రాక్టు కార్మికులకు లాభాలవాట, పీఎల్ఆర్ బోనస్, పండుగ అడ్వాన్సులు, వివిధ రకాల అలవెన్సులు సాధించి పెట్టింది ఏఐటీయూసీ అని, ఇందులో యూనియన్ నేతలు కొమరయ్య, విఠల్ రావు వంటి నాయకుల కృషి ఉందని గుర్తు చేశారు. అనంతరం సహఫంక్తి భోజనాలను ప్రారంభించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ భద్రాద్రి జిల్లా గౌరవ అధ్యక్షులు, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే. సాబీర్ పాషా, గుర్తింపు సంఘం నాయకులు కె. రాజ్ కుమార్, దమ్మాలపాటి శేషయ్య, వంగ వెంకట్, జి. వీరస్వామి, వట్టికొండ మల్లికార్జునరావు, ఎస్వీ రమణమూర్తి, గట్టయ్య, సందెబోయిన శ్రీనివాస్, రాములు, కిష్టోఫర్, మధుకృష్ణ, రాము పాల్గొన్నారు. 

Tags:    

Similar News