వామ్మో.. వాసన.. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కంపుతో సతమతం
భద్రాద్రి జిల్లా ప్రధాన ఆసుపత్రి ప్రాంగణంలో గత కొన్ని నెలలుగా సెప్టిక్ ట్యాంకుల్లో మురుగు నిండిపోయి పొంగి పొర్లడంతో దుర్వాసన వెదజల్లుతున్నది.
భద్రాద్రి జిల్లా ప్రధాన ఆసుపత్రి ప్రాంగణంలో గత కొన్ని నెలలుగా సెప్టిక్ ట్యాంకుల్లో మురుగు నిండిపోయి పొంగి పొర్లడంతో దుర్వాసన వెదజల్లుతున్నది. ఉన్న రోగాన్ని తగ్గించుకునేందుకు ఆస్పత్రికి వస్తే కొత్త రకం జబ్బులు వచ్చేలా ఇక్కడి ప్రాంగణం ఉందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రహదారి పై పారుతున్న మురుగునీటిని తొక్కుకుంటూ ఆస్పత్రిలోకి వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. రోజులు గడుస్తున్నా ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలు పరిష్కారం కాకపోగా రోగుల సహాయకులకు గుదిబండగా మారిన సెప్టిక్ ట్యాంకుల నుంచి వచ్చే దుర్వాసన సమస్య పరిష్కారం కావడం లేదు. ఈ సమస్యను పరిష్కరించకపోతే కొత్త జబ్బులతో ఆసుపత్రుల పాలయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దిశ, కొత్తగూడెం రూరల్ : స్వచ్ఛమైన వాతావరణంతో కనిపించాల్సిన ప్రభుత్వ దవాఖాన అపరిశుభ్రతతో ఉండటంతో ఇటు రోగులకు, అటు సహాయకులకు అసౌకర్యంగా మారడంతో పాటు తలనొప్పిగా మారింది. ఉన్న రోగాన్ని తగ్గించుకునేందుకు ఆసుపత్రికి వస్తే కొత్త రకం జబ్బులు వచ్చేలా ఆస్పత్రి ప్రాంగణం ఉందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అహ్లాదకర వాతావరణం తలపించేలా ఉండాల్సిన ప్రజా దవాఖాన దుర్వాసనకు, అపరిశుభ్రతకు నిలయంగా నిలుస్తున్నడం పట్ల ప్రజల నుంచి అసహనం వ్యక్తమవుతోంది.
భద్రాద్రి జిల్లా ప్రభుత్వ దవాఖాన సమస్యలకు నిలయంగా నిలిచింది. ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని గతంలో సీపీఎం ఆధ్వర్యంలో ఆస్పత్రి ముందు అనేక నిరసన కార్యక్రమాలు నిర్వహించినా ఫలితం లేదు. ఖాళీగా ఉన్న డాక్టర్ పోస్టులను భర్తీ చేయాలని సిటీ స్కాన్ ఎంఆర్ఐ స్కాన్ సదుపాయం కల్పించాలని ప్రజలకు అవసరమయ్యే మందులను అందుబాటులో ఉంచాలని ప్రాంగణంలో వెదజల్లుతున్న మురుగు నివారణకు చర్యలు చేపట్టాలని, డిమాండ్లతో ఆందోళన నిర్వహించి సంబంధిత అధికారులకు వినతి పత్రాలు అందించిన విషయం తెలిసిందే. రోజులు గడుస్తున్నా ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలు పరిష్కారం కాకపోగా రోగులకు సహాయాకులకు గుదిబండగా మారిన సెప్టిక్ ట్యాంకుల నుంచి వచ్చే దుర్వాసన సమస్య మాత్రం పరిష్కారం కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.
పొంగుతున్న సెప్టిక్ ట్యాంకుల మురుగు...
జిల్లా ప్రధాన ఆస్పత్రి ప్రాంగణంలో గత కొన్ని నెలలుగా సెప్టిక్ ట్యాంకులలో మురుగు నిండిపోయి పొంగి పొర్లడంతో ఆ మురుగంతా కాలువ పారుతూ బయటికి వస్తుంది. ఈ మురుగును చూసిన జనం ఆందోళన చెందుతున్నారు. ఉన్న రోగాన్ని తగ్గించుకునేందుకు ఆసుపత్రికి వస్తే స్వాగతం పలుకుతున్న దుర్వాసనతో కొత్త జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దుర్వాసన ముక్కులు పగిలిపోయేలా వస్తున్నప్పటికీ పట్టించుకునే దిక్కులేదు. రహదారిపై పారుతున్న మురుగునీటిని తొక్కుకుంటూ ఆస్పత్రిలోకి వెళ్లాల్సిన దుస్థితి నెలకొందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించకపోతే కొత్త జబ్బులతో ఆసుపత్రుల పాలయ్యే అవకాశం ఉందని దీనిని గమనించి వైద్యశాఖ ఉన్నత అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ప్రజావాణిలోనూ ఫిర్యాదు..
ప్రభుత్వ ప్రజా వైద్యశాలలో వెదజల్లుతున్న గబ్బుతో ఇటు రోగులు అటు సహాయకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దుర్వాసన సమస్యను పరిష్కరించాలని కోరుతూ... ఇటీవల జరిగిన ప్రజావాణిలో తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థి యువజన సంఘం ప్రధాన కార్యదర్శి కోటా శివశంకర్ జిల్లా జాయింట్ కలెక్టర్కు వినతిపత్రం ద్వారా విన్నవించడం జరిగింది. ఆస్పత్రి ఆవరణలో పారుతున్న మురుగునీటి సమస్యను పరిష్కరించకపోతే నిరసన కార్యక్రమాలు చేపడతామని కోట శివశంకర్ హెచ్చరించారు. ఇదిలా ఉండగా జిల్లా కలెక్టర్ వైద్య విద్యపై ఫోకస్ పెట్టి వాటి అభివృద్ధికి చిత్తశుద్ధితో ముందుకు వెళ్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రజా వైద్యశాలలో వివిధ సమస్యలపై పలువురు వినతి పత్రాలు ఇవ్వడం పట్ల జిల్లా కేంద్రంలో చర్చనీయాంశంగా మారింది.