Minister Thummala : దేశానికే తెలంగాణ పరిపాలన మార్గదర్శకం
భారతదేశానికే తెలంగాణ రాష్ట్ర పరిపాలన మార్గదర్శకంగా
దిశ,వైరా : భారతదేశానికే తెలంగాణ రాష్ట్ర పరిపాలన మార్గదర్శకంగా నిలుస్తుందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. వైరాలోని న్యూ లిటిల్ ప్లవర్ పాఠశాల సమీపంలో గురువారం రైతు సదస్సుని నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరైన ఈ రైతు సదస్సు సభలో తుమ్మల నాగేశ్వరరావు ప్రసంగించారు. ఖమ్మం జిల్లాలోని నాగార్జునసాగర్ ఆయకట్టును గోదావరి జలాలతో అనుసంధానం చేయడమే తన లక్ష్యమన్నారు. వచ్చే 4 సంవత్సరాలలో 8 వేల కోట్ల నిధులతో సీతారామ ప్రాజెక్టును పూర్తి చేసి పాలేరుకు గోదావరి జలాలను తీసుకువెళ్తామని స్పష్టం చేశారు.
గోదావరి జలాలు తీసుకువచ్చి ఖమ్మం జిల్లా ప్రజల రుణం తీర్చుకుంటామన్నారు. సీతారామ ప్రాజెక్టు కు సంబంధించి అనేక అవాంతరాలు ఎదురైనా ప్రభుత్వం అన్ని రకాల అనుమతులు తీసుకువచ్చిందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే 600 కోట్ల రూపాయలను సీతారామ ప్రాజెక్టుకు కేటాయించిందన్నారు. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తామని వివరించారు. 114 కిలోమీటర్ల మెయిన్ కెనాల్ వచ్చి జూలూరుపాడు టన్నెల్ ను తాకిందని చెప్పారు. యాతాలకుంట జూలూరుపాడు టన్నల్లను పూర్తి చేయాల్సి ఉందని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు రుణమాఫీ చారిత్రాత్మక మని కొనియాడారు. 31 వేల కోట్ల రుణాలను ఒకేసారి మాఫీ చేసేందుకు ప్రభుత్వం కృషి చేసిందని అభినందనీయమన్నారు. ఇప్పటి వరకు 18 వేల కోట్లను రైతులు ఖాతాల్లో జమ చేశామని వివరించారు. భద్రాద్రి శ్రీరామచంద్రుడి సాక్షిగా రుణమాఫీ పై మాట ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాట ఇస్తే తప్పదు అని చెప్పడానికి ఈ రుణమాఫీ చేసి చూపించారన్నారు.
రెండు లక్షల కంటే ఎక్కువ రుణమున్న రైతులు ఆ నగదును బ్యాంకులకు చెల్లించి రుణమాఫీని పొందాలన్నారు. ఇప్పటివరకు 42 లక్షల రైతుల ఖాతాల్లో రుణమాఫీ నగదును జమ చేశామని వివరించారు. రైతు రుణమాఫీ రానివారు తమకు వాట్సప్ చేయండి అని బి ఆర్ ఎస్ నాయకులు చేస్తున్న ప్రచారంపై తుమ్మల స్పందించారు. 2018 ఎన్నికల్లో మీరు ఇస్తామని చెప్పి ఎగనామం పెట్టి లక్ష రూపాయలు అందని రైతుల ఖాతాలు వివరాలు తెలుసుకొని నగదు వేయండని బీఆర్ఎస్ నాయకులకు తుమ్మల సూచించారు. తెలంగాణ రాష్ట్ర రైతుల పండగను వైరా గడ్డపై జరుపుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు.ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీలు రఘురామిరెడ్డి, బలరాం నాయక్ ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు.