Minister Thummala : ఎంతటి విపత్తు వచ్చిన నష్టం వాటిల్లకుండా ప్రణాళికలు

ఎంతటి విపత్తు వచ్చినా నష్టం వాటిల్లకుండా ప్రణాళికలు సిద్ధం

Update: 2024-09-11 08:59 GMT

దిశ, భద్రాచలం : ఎంతటి విపత్తు వచ్చినా నష్టం వాటిల్లకుండా ప్రణాళికలు సిద్ధం చేయాలని, ముఖ్యంగా గోదావరి ఎన్ని అడుగులు వచ్చిన గోదావరి పరివాహక ప్రాంతాలు నష్టపోకుండా ఉండేలా చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కలెక్టర్ జితేష్ వి పాటిల్ ను ఆదేశించారు. బుధవారం భద్రాచలంలో జరిగిన గోదావరి వరదలు జిల్లా స్థాయి సమీక్షా సమావేశంలో మంత్రి తుమ్మల అన్ని శాఖల అధికారులను భారీ వర్షాలు, గోదావరి వరదలు కారణంగా వాటిల్లిన నష్టం గురించి అడిగి తెలుసుకున్నారు. గోదావరి వరదలు, భారీ వర్షాలు వచ్చినా ఎక్కువ నష్టం వాటిల్లకుండా సమర్ధవంతంగా విధులు నిర్వహించిన జిల్లా ప్రభుత్వ యంత్రాంగాన్ని కొనియాడారు.ప్రతి గ్రామానికి వాహనాలు వెళ్లేలా వెంటనే గ్రామీణ ప్రాంతాల్లో వరదలకు దెబ్బతిన్న రోడ్లు కు మరమ్మతులు వెంటనే చేపట్టాలని పంచాయతీ అధికారులను ఆదేశించారు.

అలాగే గ్రామాలకు విద్యుత్, త్రాగునీరు సమస్య లేకుండా చూడాలని అన్నారు. భద్రాచలం పట్టణంలో 24 గంటలు త్రాగునీరు అందించడానికి ప్రణాళికలు రూపొందించాలని పేర్కొన్నారు.కరకట్ట లోపల గోదావరి స్థలంలో ఎటువంటి నిర్మాణాలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. పంట నష్టం వివరాలు వెంటనే తెలపాలని వ్యవసాయ అధికారులను కోరారు. వరదలలో నష్టపోయిన అందరికి నష్టపరిహారం అందుతుందని, ఎవరు అధైర్య పడాల్సిన పనిలేదని పేర్కొన్నారు.ఐటీసీ, హెవీ వాటర్ ప్లాంట్ కర్మాగారాలు ద్వారా వచ్చే వ్యర్థ జలాలను శుద్ధి చేసిన అనంతరం గోదావరిలో కలిపేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ని కోరారు.

ఐదు పంచాయతీలు గురించి ఆంధ్ర ప్రభుత్వం తో మాట్లాడుతాం..

భద్రాచలం అభివృద్ధి జరగాలంటే ముందుగా స్థలం కావాలని, పోలవరం ముంపు పేరుతో ఆంధ్రలో విలీనం అయిన ఐదు పంచాయుతీలు తిరిగి భద్రాచలంలో కలిపేందుకు ఆంధ్ర ప్రభుత్వంతో మాట్లాడి ఒప్పిస్తామని అన్నారు.

రామాలయం అభివృద్ధికి భూసేకరణ తొందరగా చేపట్టండి..

రామాలయం అభివృద్ధికి భూసేకరణ తొందరగా చేపట్టాలని, భూసేకరణ పూర్తి అయితే తప్ప అభివృద్ధికి అడుగులు ముందుకు పడవని, వెంటనే భూసేకరణ చేపట్టాలని ఆర్ డి ఓ ని ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మళ్ళీ భద్రాచలం వచ్చేసరికి ఒక స్వరూపం చూపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐ టి డి ఏ ప్రాజెక్టు అధికారి రాహుల్, ఎస్ పి రోహిత్ రాజ్, ఆర్ డి ఓ దామోదర్ రావు, అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.


Similar News