Minister Ponguleti : 10 సంవత్సరాల్లో చుక్కనీరు ఇవ్వని బీఆర్ఎస్
గడిచిన పది సంవత్సరాల్లో రాష్ట్రాన్ని పరిపాలించిన బీఆర్ఎస్ సీతారామ
దిశ, వైరా: గడిచిన పది సంవత్సరాల్లో రాష్ట్రాన్ని పరిపాలించిన బీఆర్ఎస్ సీతారామ ప్రాజెక్టు నుంచి చుక్కనీరు రైతులకు ఇవ్వలేదని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా వైరా లోని న్యూ లిటిల్ ఫ్లవర్స్ పాఠశాల సమీపంలో గురువారం నిర్వహించిన రైతు సదస్సులో ఆయన ప్రసంగించారు. గడిచిన పదేళ్లు రాష్ట్రాన్ని పరిపాలించిన బీఆర్ఎస్ తెలంగాణను అప్పుల కుప్పగా మార్చిందని విమర్శించారు. గడిచిన 10 ఏళ్లలో 7.18 లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని ఆర్థికంగా దెబ్బతీసింది అన్నారు. టిఆర్ఎస్ అయామ్ లో ప్రభుత్వ ఉద్యోగులకు నెలవారి జీతాలు, సక్రమంగా ఇవ్వలేదన్నారు.
ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గాడిలో పెట్టిందన్నారు. 2004 సంవత్సరంలోనే అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి కృష్ణ గోదావరి జలాలను అనుసంధానం చేయాలని తపనతో ప్రాజెక్టులను రూపకల్పన చేశారని చెప్పారు. ఆయన హయాంలో రూపకల్పన చేసిన ప్రాజెక్టులను రీ డిజైన్ చేసి బీఆర్ఎస్ ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసిందని విమర్శించారు. రైతులకు రెండు లక్షల రుణ మాఫీ చారిత్రాత్మకమని కొనియాడారు. రైతులను రాజుగా మార్చటమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీలు రఘురామిరెడ్డి, బలరాం నాయక్ ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు.