నూతన కార్పొరేషన్ గా కొత్తగూడెం
తెలంగాణ ప్రభుత్వం కొత్తగూడెం ని కార్పొరేషన్ గా ప్రకటిస్తూ సోమవారం అసెంబ్లీలో బిల్లును ఆమోదించింది.

దిశ, కొత్తగూడెం: తెలంగాణ ప్రభుత్వం కొత్తగూడెం ని కార్పొరేషన్ గా ప్రకటిస్తూ సోమవారం అసెంబ్లీలో బిల్లును ఆమోదించింది. కొత్తగూడెం మున్సిపాలిటీ, పాల్వంచ మున్సిపాలిటీ, సుజాతనగర్ మండలం లోని ఏడు పంచాయతీలని ఏర్పాటు చేస్తున్నట్లు సోమవారం అసెంబ్లీలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రకటన చేశారు. కొత్తగూడెం మున్సిపాలిటీలో 97,337 మంది జనాభా, పాల్వంచ మున్సిపాలిటీలో 89,721 మంది జనాభా, సుజాతనగర్ ఏడు పంచాయతీలు 11,124 మంది జనాభాతో కలిపి మొత్తం 1,98,182 మంది జనాభా నూతన కొత్తగూడెం కార్పొరేషన్ లో ఉన్నారు. పాల్వంచ మున్సిపాలిటీ వైశాల్యం 40.87 చదరపు కిలోమీటర్లు, కొత్తగూడెం మున్సిపాలిటీ వైశాల్యం 15.87 చదరపు కిలోమీటర్లు, సుజాతనగర్ లోని ఏడు పంచాయతీ లు 28.48 చదరపు కిలోమీటర్ల తో కలిపి మొత్తం 85.22 చదరపు కిలోమీటర్లతో నూతనంగా కొత్తగూడెం కార్పొరేషన్ ఏర్పాటు అయింది.
నగరపాలక సంస్థ బిల్లుని ఆమోదించిన అసెంబ్లీ సోమవారం కొత్తగూడెం, పాల్వంచతో ఏడు గ్రామ పంచాయతీలను కలిపి నగరపాలక సంస్థగా ఏర్పాటు చేసేందుకు బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఈ బిల్లుకి ఆమోదం తెలపాలని అసెంబ్లీలో సభ్యులను కోరారు. అసెంబ్లీ సభ్యుల ఆమోదం తో కొత్తగూడెం కార్పొరేషన్ బిల్లు అసెంబ్లీలో ఆమోదించారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆమోదించారు. కొత్తగూడెం ను కార్పొరేషన్ గా ఏర్పాటు చేస్తానని మాట ఇచ్చి నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి కొత్తగూడెం శాసనసభ్యులు సాంబశివరావు అసెంబ్లీలో ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. బిల్లుని ఆమోదించేందుకు సహకరించిన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి, జిల్లా ఇన్చార్జి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి, స్పీకర్ గడ్డం ప్రసాద్ రావు కి, ఎమ్మెల్యేలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజల తరఫున అసెంబ్లీ లో ఎమ్మెల్యే కూనంనేని ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలిపారు. గత కొన్ని దశాబ్దాలుగా పాల్వంచ మున్సిపాలిటీలో ఎన్నికలు లేక అభివృద్ధి కుంటుపడిందని, కార్పొరేషన్ ఏర్పాటుతో పాల్వంచలో ఎన్నికలకి ఇప్పుడు అన్ని అడ్డంకులు తొలగిపోయాయని సాంబశివరావు అన్నారు.
అభివృద్ధిలో దూసుకుపోతున్న కొత్తగూడెం కార్పొరేషన్ గా ఏర్పడడంతో అభివృద్ధిలో దూసుకుపోనుంది. కొత్తగూడెం,పాల్వంచ, సుజాతనగర్ పరిసర ప్రాంతాల్లో భూముల ధరలు అమాంతం పెరిగే అవకాశం ఉన్నదని రియల్ ఎస్టేట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఒకపక్క కార్పొరేషన్ ఏర్పాటు కావడం, మరోపక్క విమానాశ్రయం ఏర్పాటుకు సైతం రంగం సిద్ధం కావడంతో వ్యాపారాలు పుంజుకొనున్నట్లు వ్యాపార వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ఏజెన్సీ జిల్లా భద్రాద్రి కొత్తగూడెంలో జిల్లా కేంద్రమైన కొత్తగూడెం మున్సిపాలిటీ, పాల్వంచ మున్సిపాలిటీ, సుజాతనగర్ మండలం లోని ఏడు పంచాయతీలతో కలిపి కార్పొరేషన్ ఏర్పడడంతో చుట్టుపక్కల గిరిజన గ్రామాల ప్రజలకు మెరుగైన సౌకర్యాలు ఏర్పడనున్నాయి. కార్పొరేషన్ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులతో పాటు అదనంగా కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా కేటాయించనున్నారు. ముఖ్యంగా మున్సిపాలిటీ కార్పొరేషన్ ఏర్పాటు వలన నూతన పరిశ్రమలు, నూతన వ్యాపార స్థాపనకు మార్గం సుగమం కానుంది. మున్సిపాలిటీల కంటే కార్పొరేషన్లకు ఎక్కువ ఆర్థిక వనరులు కలిగి ఉండడం వలన ఈ ప్రాంతం అభివృద్ధి చెంది పట్టణ ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందుతాయి. అదే విధంగా ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరుస్తుంది. నూతన ఉద్యోగ కల్పనతో నిరుద్యోగ సమస్యలు తొలగిపోతాయి. కొత్తగూడెం కార్పొరేషన్ ఏర్పాటు ద్వారా నూతన పెట్టుబడులకి, వ్యాపార వర్గాల విస్తరణకు ఎంతగానో దోహదపడుతుంది.