అంతా మా ఇష్టం ..అందుబాటులో లేని మండల లైబ్రేరియన్స్

ప్రభుత్వం ఓవైపు భారీ ఎత్తున ఉద్యోగాలు భర్తీ చేస్తుండగా, పోటీ పరీక్షల కోసం సన్నద్ధం అవుతున్న వారికి అండగా ఉండాల్సిన మండల లైబ్రేరియన్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నిరుద్యోగ

Update: 2023-02-24 03:12 GMT

ప్రభుత్వం ఓవైపు భారీ ఎత్తున ఉద్యోగాలు భర్తీ చేస్తుండగా, పోటీ పరీక్షల కోసం సన్నద్ధం అవుతున్న వారికి అండగా ఉండాల్సిన మండల లైబ్రేరియన్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నిరుద్యోగ అభ్యర్థులకు సాయం చేయాల్సింది పోయి పట్టనట్లుగా ఉంటున్నారు. డ్యూటీకి రావాల్సి ఉన్నా ఇంటి వద్దే ఉంటూ అటెండర్, స్వీపర్లతో పని చేయిస్తున్నారు. ఖమ్మం జిల్లావ్యాప్తంగా మండల గ్రంథాలయాల్లో ఇదే తంతు కొనసాగుతున్నట్లు దిశ స్థూల పరిశోధనలో వెల్లడైంది. మండల గ్రంథాలయాల్లో 8వేల నుంచి 10వేల అభ్యర్థులు పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్నట్లు అంచనా. వీరికి సరైన సౌకర్యాలు కల్పించాల్సిన లైబ్రేరియన్లు కానరాకపోడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సిబ్బంది లక్షల్లో వేతనాలు తీసుకుంటున్నా.. డ్యూటీకి రాకుండా నిర్లక్ష్యం వహించడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. మరోవైపు ఇక్కడి ఉద్యోగులు తప్పుడు ధ్రువపత్రాలతో ఉద్యోగాలు పొందారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దృష్టిసారించాల్సిన జిల్లా డిప్యూటీ లైబ్రరీయన్ మిన్నకుండిపోయారు.

దిశ,ఖమ్మం సిటీ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్1, 2, 3 4, గురుకులాలు, జూనియర్ లెక్చరర్లు, స్టాఫ్ నర్స్ వంటి పోస్టులను వేల సంఖ్యలో భర్తీ చేస్తున్నది. ఈ నియామకాల కోసం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 24లక్షల మంది ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారు. జిల్లాల వారీగా సుమారుగా లక్ష నుంచి రెండు లక్షల వరకు దరఖాస్తు చేసుకున్నారు. ఎలాగైన కొలువులు సాధించాలని పలువురు అభ్యర్థులు అద్దె రూములు, ప్రైవేటు స్టడీ హాల్స్ ను ఆశ్రయిస్తుంటే మరికొందరు ప్రభుత్వం కేటాయించిన జిల్లా, మండల గ్రంథాలయాల్లో ప్రిపరేషన్‌ను కొనసాగిస్తున్నారు. కానీ అసలు సమస్య ఇక్కడే మొదలయ్యింది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పలు గ్రంథాలయాల్లో 8వేల నుంచి 10వేల అభ్యర్థులు పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్నట్లు అంచనా. అందులో ఒక జిల్లా గ్రంథాలయంలోనే సుమారు రెండు వేల మంది ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారు. మండలాల పరిధిలో గ్రంథాలయాలు ఉన్నా అక్కడ సిబ్బంది లక్షల్లో వేతనాలు తీసుకుంటున్నా.. వారు డ్యూటీకి రాకుండా కేవలం అటెండర్, స్వీపర్ల ద్వారానే పనులు నడిపిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఇదే తంతు కొనసాగుతున్నది. ముఖ్యంగా ఇటువంటి పరిస్థితి కూసుమంచి, ఖమ్మం రూరల్, ఏన్కూరు, తల్లాడ, కల్లూరు, బోనకల్లు, నేలకొండపల్లి, మధిర, వైరా, చింతకాని, మండలాల్లో దిశ స్థూల పరిశోధనలో వెల్లడైంది.

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఒకవైపు రిక్రూట్మెంట్ ప్రక్రియ జరుపుతుంటే జిల్లా గ్రంథాలయ ఉద్యోగులు మాత్రం నిమ్మకు నిరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు. ఈసమస్యతో కొన్ని వేల మంది విద్యార్థులు జిల్లావ్యాప్తంగా నష్టపోతున్నారు. ఇటీవల ప్రభుత్వం వారు అదనపు మరుగుదొడ్లు, స్టడీ హాలు నిర్మించి, నిరుద్యోగులకు సౌకర్యాలు కల్పించినా మండల గ్రంథాలయాల ఉద్యోగులు స్వీపర్ అటెండర్‌తో పనులు కొనసాగిస్తున్నారని జిల్లా వ్యాప్తంగా దిశ నిర్వహించిన స్థూల పరిశోధనలు వెల్లడైంది. గ్రంథాలయ సంస్థలో పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగులు కారుణ్య నియామకం, తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో ఉద్యోగం పొందినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై కలెక్టర్ విచారణ జరిపిస్తే అసలు నిజాలు వెల్లడవుతాయని నిరుద్యోగులు అంటున్నారు. జిల్లా డిప్యూటీ లైబ్రరీ పర్యవేక్షణ లోపమే కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై స్థానిక మంత్రి స్పందించాలని జిల్లా నిరుద్యోగులు కోరుకుంటున్నారు.

Tags:    

Similar News