బీఆర్ఎస్ లో అంతర్గత విభేదాలు

నియోజకవర్గ బీఆర్ఎస్ లో ముఖ్య నాయకుల్లో అంతర్గత విభేదాలు ఆదివారం బయటపడ్డాయి.

Update: 2024-11-17 14:09 GMT

దిశ, దమ్మపేట : నియోజకవర్గ బీఆర్ఎస్ లో ముఖ్య నాయకుల్లో అంతర్గత విభేదాలు ఆదివారం బయటపడ్డాయి. మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు మండలంలోని మందలపల్లి గ్రామంలోని తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆయన కొనసాగుతున్న బీఆర్ఎస్ పార్టీపై, మాజీ ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావులపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు రేగా కాంతారావు, మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు వలన నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీకి ఒరిగింది ఏమీ లేదని అన్నారు. శనివారం మండలంలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశానికి కనీసం తనకు సమాచారం కూడా ఇవ్వలేదని, జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు పదవి అనుభవిస్తున్న రేగా కాంతారావు ఆ పదివి ఎలా చేపట్టాలో నేర్చుకోవాలని విమర్శించారు.

     ఒక జిల్లా అధ్యక్షుడు ఏదైనా నియోజకవర్గానికి వస్తున్నప్పుడు ఆ నియోజకవర్గంలో ఉన్న ముఖ్య నాయకులు అందరికీ సమాచారం ఇచ్చి రావాలని, కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు వ్యవసాయ క్షేత్రంలో పార్టీ మీటింగ్ లు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. కనీసం ఈ నాయకులకు కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకతను ఎలా క్యాచ్ చేసుకోవాలో కూడా తెలియదని, ప్రజల్లో సమావేశాలు పెడితే పార్టీకి మైలేజ్ వస్తుంది కానీ అడవిలో, తోటల్లో పెడితే ఏమీ ఒరగదని అన్నారు. మెచ్చా నాగేశ్వరరావు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి ఏమీ లేదని, కేంద్ర నిధులు ఇక్కడికి రావడంతో ఆ నిధులతో మెచ్చ నాగేశ్వరరావు ఇక్కడ బిల్డప్ ఇచ్చారని ఆరోపించారు.

     ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాను ప్రచారం చేయకపోతే మెచ్చా నాగేశ్వరరావుకు కనీసం డిపాజిట్లు కూడా వచ్చేవి కావని, నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో తిరగకుండా, టీవీల్లో, పేపర్లో వచ్చినవి చదువుతూ తోటలో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. ఆ సమావేశాల్లో కనీసం పార్టీ జెండాలు కూడా పెట్టకపోవడం బాధాకరమని అన్నారు. రేగా కాంతారావు, మెచ్చా నాగేశ్వరరావు వలన నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ పరువు పోతుందని, ఈయనకు నియోజకవర్గ ఇన్చార్జి పదవి ఇవ్వకపోయినా ఇన్చార్జ్ అని చెప్పుకుంటూ బిల్డప్ ఇస్తున్నారని, రేగా కాంతారావు జిల్లా ఇన్చార్జిగా ఉంటూ ఇద్దరు కలిసి పార్టీని సర్వనాశనం చేస్తున్నారని ఆరోపించారు. తనను శనివారం జరిగిన ముఖ్య నాయకుల సమావేశానికి ఎందుకు పిలవలేదని, రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ తనని ఏమైనా పార్టీకి దూరంగా పెట్టిందా? అన్న సమాధానం ఈ ఇద్దరి నాయకులు చెప్పాలన్నారు. బీఆర్ఎస్ పార్టీలో తనకు సముచిత స్థానం కల్పించకపోతే రానున్న రోజుల్లో పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని హెచ్చరించారు. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం తాటి వెంకటేశ్వర్లు మీడియా సమావేశంతో పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయని చెప్పుకోవాలి. 


Similar News