తోగూడెంలో అక్రమ మైనింగ్.. రూ.కోట్లలో ప్రభుత్వ ఆదాయానికి గండి
‘ధనం మూలం.. ఇదం జగత్’ అన్న ఫార్ములాను తూచా తప్పకుండా పాటిస్తున్నారు కొందరు.
దిశ ప్రతినిధి, కొత్తగూడెం: ‘ధనం మూలం.. ఇదం జగత్’ అన్న ఫార్ములాను తూచా తప్పకుండా పాటిస్తున్నారు కొందరు. పాల్వంచ మండలం తోగూడెం మైనింగ్ మాఫియా బాబులు ధనార్జనే ధ్యేయంగా అనుమతులకు మించి నడుస్తున్న మైనింగ్ మాఫియాలో అనేక మంది పెద్ద మనుషులు సూత్రధారులుగా ఉన్నారు. రూ.కోట్లు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. పాల్వంచ మండలం తోగూడెంలో దశాబ్దాల కాలంగా మైనింగ్ మాఫియా కోరలు చాచినప్పటికీ వారి ఆగడాలకు అడ్డూ అదుపు చెప్పే అధికారే లేకపోవడం ఆశ్చర్యంగా ఉంది.
ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి
పాల్వంచ మండలం తోగూడెంలో పూర్తిస్థాయి అనుమతులు లేకుండా సుమారు 7 క్వారీలు నడుపుతున్నారు. తీసుకున్న అనుమతులకు మించి అధికారులకు తప్పుడు లెక్కలు చూపుతూ.. ఎకరాల కొద్ది భూమిని తోడుతూ రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. ఈ అక్రమ మైనింగ్ వ్యవహారం తెలుసుకుని ఎవరైనా అటుగా వెళితే అంతే సంగతులు. వీలైతే బుజ్జగింపులు లేదంటే బెదిరింపులకు గురి చేస్తున్నారు. ఏదేమైనా మైనింగ్ మాఫియాను అడ్డుకోవడానికి చూస్తే అంతే సంగతులు. గిరిజన చట్టమైన 170 పరిధిలో ఉన్న భూమిలో ఎలాంటి క్వారీలు నడపకూడదని చట్టం చెబుతున్నప్పటికీ చట్ట పరిధిని దాటి బినామీల పేర్లతో దందాకు తెర లేపారు.
అధికారుల ఆశీర్వాద బలంతోనే అక్రమ మైనింగ్ నడుస్తుందా..? అధికారుల ఆశీర్వాద బలంతోనే అక్రమ మైనింగ్ దందా నడుస్తుందని జిల్లా వ్యాప్తంగా చర్చ లేకపోలేదు. అరకోరా దాడులతో అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని వారి ఆశీర్వాద బలంతోనే అక్రమ మైనింగ్ వ్యవహారం అంతా జరుగుతోందని చర్చ జరుగుతోంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో అనుమతులు లేని బాంబ్ బ్లాస్టింగ్స్ చేస్తూ తోగూడెం గ్రామ ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారని ప్రజలు అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ బాంబుల మోత ఇప్పటికీ తగ్గలేదు. క్వారీకి వెళ్లి వచ్చే భారీ వాహనాలతో పరిసర ప్రాంత గ్రామ ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నామని గతంలో ఆందోళనలు సైతం చేసినప్పటికీ మైనింగ్ మాఫియా తీరు మారలేదని పులువురు వాపోతున్నారు.
గతంలో అక్రమ మైనింగ్ రూ.66 కోట్లు ఫైన్
తోగూడెం క్వారీల్లో అనుమతులకు మించి తవ్వకాలు జరుగుతున్నాయని గతంలో వారికి రూ.66 కోట్ల ఫైన్ విధించారు అధికారులు. అయితే, ఆ జరిమానాను సవాలు చేస్తూ కోర్టుని ఆశ్రయించి న్యాయస్థానం నిజ నిర్ధారణ చేయక ముందే మళ్లీ బ్లాస్టింగ్స్ చేస్తున్నారు అక్రమార్కులు.
వలస కూలీలకు భద్రత కరువు
ఈ క్వారీల్లో పని చేసే వలస కూలీలకు కనీస భద్రత ఉండదు. భద్రత ప్రమాణాలు పాటించకుండా జరిగిన బాంబ్ బ్లాస్టింగ్స్‌లో అనేక మంది కూలీలు ప్రాణాలు కోల్పోయారు. వ్యవహారం మూడో కంటికి తెలవకుండా వలస కూలీల ప్రాణాలకు వెళ్లగొట్టి చేతులు దులుపుకోవడంలో సిద్ధహస్తులు మైనింగ్ మాయగాళ్లు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు అక్రమ క్వారీల నిర్వహణపై పూర్తి విచారణ చేపట్టి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న అక్రమార్కుల భరతం పట్టాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.